మహాముత్తారం, సెప్టెంబర్ 21: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలానికి చెందిన TGSS క్రీడాకారుడు లింగమల్ల కౌశిక్ రామ్ రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఘట్‌కేసర్‌లో సెప్టెంబర్ 16న నిర్వహించిన అండర్–12 రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కౌశిక్ రామ్ సాబ్రే విభాగంలో అద్భుత ప్రదర్శన చేసి కాంస్య పతకం సాధించాడు. చిన్న వయసులోనే ఫెన్సింగ్ క్రీడపై ఆసక్తి పెంచుకున్న కౌశిక్ రామ్, రాష్ట్రస్థాయి పోటీల్లో తన ప్రతిభను చాటుకున్నాడు. కఠినమైన పోటీల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొని పతకం సాధించడంతో పాటు జమ్మూ కాశ్మీర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు అర్హత సాధించాడు. ఈ సందర్భంగా కౌశిక్ రామ్ మాట్లాడుతూ రాష్ట్రస్థాయి పోటీల్లో కాంస్య పతకం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ విజయం తనకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో కూడా మెరుగైన ప్రదర్శన చేసి పతకం సాధించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కౌశిక్ రామ్ జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల తల్లిదండ్రులు, కోచ్‌లు, TGSS నిర్వాహకులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు. జాతీయస్థాయిలోనూ ప్రతిభ కనబరిచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.


Post A Comment: