భూపాలపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. బుధవారం భూపాలపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించి, చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను రవి పటేల్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలను స్వయంగా తెలుసుకున్న ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడి, సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం రవి పటేల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. వైద్యులు సమయానికి విధులకు హాజరై రోగులకు అందుబాటులో ఉండాలని కోరారు. చికిత్స విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రోగుల ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సహించబోదని హెచ్చరించారు. గతంలోనూ ప్రభుత్వ ఆసుపత్రిలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పోరాడామని గుర్తుచేశారు. ఇకముందు కూడా ప్రజలు, రోగుల సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరఫున నిరంతరం పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ జిల్లా నాయకులు మడే సంతోష్, లక్పతి రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: