కాటారం: స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కాటారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీధర్‌బాబు, శ్రీనుబాబు ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తెప్పల దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్ కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, పేదల ఆశాజ్యోతి, రైతుల ఆపద్బాంధవుడని కొనియాడారు. పేదలు, రైతుల సంక్షేమంతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసిన వైఎస్సార్ సేవా స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శమన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మహానేతకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా, యువజన నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: