కాటారం: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాటారం మండల కేంద్రంలో ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులందరూ సమాన పనికి సమాన వేతనం పొందుతున్నప్పటికీ, పెన్షన్ విషయంలో మాత్రం ఉద్యోగుల మధ్య వ్యత్యాసం చూపడం సరికాదన్నారు. 2003 సంవత్సరం నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని నిలిపివేసి, నూతన పెన్షన్ విధానమైన సీపీఎస్‌ను అమలు చేస్తున్నారని తెలిపారు. దీంతో ఉద్యోగుల భవిష్యత్ భద్రతతో పాటు వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఉద్యోగులు సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిగణనలోకి తీసుకుని సీపీఎస్‌ను రద్దు చేసి, పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానం అమలు చేయడం ద్వారా ఉద్యోగులు, వారి కుటుంబాలకు భవిష్యత్ భద్రత కల్పించాలని కోరారు. ఉద్యోగుల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరారు. ఓపీఎస్ పునరుద్ధరణ కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డీటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు రాజు నాయక్, టీపీటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు బొల్లం సతీష్, టీయూటీ మండల అధ్యక్షులు గురిసింగ విజయలక్ష్మితో పాటు ఉపాధ్యాయులు పద్మజ, సుజాత, సంధ్యారాణి, వెంకటస్వామి, రవిప్రసాద్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: