హనుమకొండ: యువత రాజకీయాల్లో ముందుండి నడవాలని, రాష్ట్ర రాజకీయాల్లో యువత కీలక పాత్ర పోషించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారు. హనుమకొండ అంబేద్కర్ భవన్‌లో నిర్వహించిన “జెన్జీ యువత చర్చ విత్ తీన్మార్ మల్లన్న” కార్యక్రమంలో సుమారు 2,000 మంది విద్యార్థులతో ఆయన భవిష్యత్ రాజకీయాలు, యువత పాత్రపై చర్చించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు రవి పటేల్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీగా హనుమకొండకు తరలివచ్చారు. పబ్లిక్ గార్డెన్ ఎదుట నినాదాలు చేస్తూ ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు.. అక్కడి నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. తీన్మార్ మల్లన్న ఆశయాలు, ఆకాంక్షలకు ఆకర్షితులైన పలువురు విద్యార్థులు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. అనంతరం రవి పటేల్ ఆధ్వర్యంలో విద్యార్థులు అంబేద్కర్ భవన్‌లో జరిగిన యువత చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజకీయ మార్పు తీసుకురావడంలో యువత పాత్ర అత్యంత కీలకమన్నారు. యువతకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తగిన అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. విద్యార్థులు తమ భవిష్యత్‌పై స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. కార్యక్రమంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గండు కరుణాకర్, బొగ్గు గని కార్మిక విభాగం అధ్యక్షుడు అనంతుల సంపత్ బొట్టు, జిల్లా పార్టీ మీడియా ఇన్‌చార్జి మడే సంతోష్, బసవరాజుపల్లి గ్రామ కమిటీ అధ్యక్షుడు అంబటి అశోక్ యాదవ్, వనం నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: