తాడిచర్ల, ఆగస్టు 8: నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఉన్న నిబంధనలను తక్షణమే పునఃసమీక్షించాలని తెలంగాణ కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి అయితే బాపు డిమాండ్ చేశారు. ప్రస్తుత నిర్మాణ వ్యయాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణానికి అందించే ఆర్థిక సాయాన్ని రూ.5 లక్షల నుంచి కనీసం రూ.10 లక్షలకు పెంచాలని కోరారు. శనివారం మలహరరావు మండలం కొయ్యూరులో నిర్వహించిన అత్యవసర విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలను ప్రభుత్వం సవరించాలని అన్నారు.

పేదలకు రూ.5 లక్షలేనా?

పాలకుల విలాసాలు, బంగ్లాల మరమ్మతులకు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. నిరుపేద కుటుంబం జీవితాంతం నివసించే ఇంటి నిర్మాణానికి కేవలం రూ.5 లక్షలు కేటాయించడం సరికాదని బాపు విమర్శించారు. ప్రస్తుతం నిర్మాణ సామగ్రి, కూలీల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

విస్తీర్ణ పరిమితిని తొలగించాలి

ఇందిరమ్మ ఇళ్లకు 400 నుంచి 600 చదరపు అడుగుల వరకు మాత్రమే నిర్మాణ పరిమితి విధించడం పేద కుటుంబాలకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. కుటుంబ అవసరాలు, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని కనీసం 1000 చదరపు అడుగుల విస్తీర్ణానికి అవకాశం కల్పించాలని కోరారు.

అప్పుల ఊబిలో లబ్ధిదారులు

ఇంటి నిర్మాణానికి అరకొరగా నిధులు రావడం, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలవుతున్నారని బాపు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి బిల్లుల చెల్లింపులను వేగవంతం చేయాలని కోరారు.

పోరాటాలకు సిద్ధం

ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలను పునఃసమీక్షించి పేదలకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే జిల్లా వ్యాప్తంగా కార్మిక, ప్రజా సంఘాలను ఏకం చేసి భారీ ఉద్యమాలు చేపడతామని బాపు హెచ్చరించారు. పేదల సొంతింటి కలను కేవలం కాగితాలకే పరిమితం చేయకుండా ప్రభుత్వం ఆచరణాత్మక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యుఐఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు, ఆదివాసీ మహిళా నాయకురాలు కాలినేని రాజమణి తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: