కాటారం: దక్షిణ కాశీగా పేరొందిన శ్రీ కాలేశ్వర–ముక్తీశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం రాత్రి వేళల్లో ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభించాలని కాటారం డివిజన్ కేంద్రం బీఆర్ఎస్ నాయకుడు జక్కు శ్రావణ్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దర్శనం, గోదావరిలో అస్తికల నిమజ్జనం, రాత్రి బస కోసం కాలేశ్వరానికి వస్తున్నప్పటికీ రాత్రి బస్సు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాలేశ్వరం అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నప్పటికీ, భక్తులకు అవసరమైన రాత్రి బస్సు సర్వీసులు లేకపోవడం బాధాకరమన్నారు. దీంతో ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తోందని, పేద, మధ్యతరగతి భక్తులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి ఒకటి, గోదావరిఖని నుంచి మరో బస్సును ప్రతిరోజూ సాయంత్రం బయలుదేరి రాత్రి 9 గంటలలోపు కాలేశ్వరం చేరుకునే విధంగా టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు ప్రారంభించాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని జక్కు శ్రావణ్ విజ్ఞప్తి చేశారు.

Post A Comment: