కాటారం, జూలై 20: కాటారం మండలం గుండా వెళ్లే జాతీయ రహదారి 353-సీపై మూగజీవాలు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని కాటారం పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు కాటారం సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ సోమవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారిపై ఆవులు, బర్రెలు, లేగలు తదితర పెంపుడు జంతువులు స్వేచ్ఛగా తిరుగుతుండడం వల్ల వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో మూగజీవాలు రహదారిపై పడుకోవడం లేదా వాహనాలకు అడ్డుగా నిలవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని పేర్కొన్నారు. మూగజీవాల యజమానులు తమ పశువులను నిర్లక్ష్యంగా రోడ్లపై వదిలివేయకుండా, తమకు చెందిన స్థలాలు లేదా పశువుల షెడ్లలోనే ఉంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు. పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తూ మూగజీవాలను రహదారులపై వదిలే యజమానులపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని కాటారం ఎస్‌ఐ శ్రీనివాస్ స్పష్టం చేశారు. రోడ్డు భద్రత కోసం ప్రజలందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Post A Comment: