కాళేశ్వరం, జూలై 21: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో 1వ వార్డులో చెట్టు విరిగి పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో వార్డు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న 1వ వార్డు మెంబర్ రేవెల్లి రాకేష్ వెంటనే స్పందించి సంబంధిత విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న విద్యుత్ సిబ్బంది ఎం.డి. వలి, ప్రవీణ్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భారీ వర్షం కొనసాగుతున్నప్పటికీ పరిస్థితిని పరిశీలించి, విద్యుత్ లైన్లకు అంతరాయం కలిగించిన చెట్టును సిబ్బంది చొరవతో తొలగించారు. అనంతరం విద్యుత్ లైన్లను పరిశీలించి ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు చేపట్టడంతో పాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో 1వ వార్డులోని కాలనీ ప్రజలకు విద్యుత్ సరఫరా అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ అంతరాయం ఏర్పడిన వెంటనే స్పందించి, సంబంధిత సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించి సమస్యను పరిష్కరించిన విద్యుత్ అధికారులకు, సిబ్బందికి 1వ వార్డు మెంబర్ రేవెల్లి రాకేష్, వార్డు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్ సిబ్బంది అందించిన తక్షణ సేవలను వార్డు ప్రజలు అభినందించారు.

Post A Comment: