మహదేవపూర్ మండలం అంబటిపల్లి గ్రామంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వడ్ల వినోద్ (30) అనే యువకుడు పొలంలో జరిగిన ట్రాక్టరు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం, వినోద్ తన పొలంలో ట్రాక్టరుతో రూట్ వెయిటర్ పనులు నిర్వహిస్తున్న సమయంలో వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ కింద నలిగిపోయిన వినోద్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద విషయం తెలుసుకున్న గ్రామ నూతన సర్పంచ్ లావణ్య వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పంచనామా నిర్వహించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వినోద్ మృతి వార్త గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబంలో ఆయన ఏకైక ఆధారమని తెలిసింది. యువకుడి అకాల మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post A Comment: