ముంబై/బారామతి: మహారాష్ట్ర రాజకీయాలు మరో కీలక మలుపు దిశగా సాగుతున్నాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) రెండు వర్గాల పునఃకలయికపై రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. మరికొన్ని గంటల్లో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనుండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తుండగా, మరోవైపు శరద్ పవార్‌తో అజిత్ కుమారుడు పార్థ్ పవార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బారామతిలో జరిగిన ఈ భేటీ సుమారు గంటకు పైగా కొనసాగినట్లు సమాచారం. NCP భవిష్యత్, రెండు వర్గాల ఐక్యత, పార్టీ పునర్నిర్మాణం అంశాలపై చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో శరద్ పవార్ వర్గం, అజిత్ పవార్ వర్గం మధ్య పెరుగుతున్న సంకేతాలు ఈ భేటీకి మరింత ప్రాధాన్యం తెచ్చాయి. ఇక అజిత్ పవార్ వర్గం ఇప్పటికే మహాయుతి ప్రభుత్వంలో భాగస్వామిగా కొనసాగుతుండగా, శరద్ పవార్ నేతృత్వంలోని NCP (శరద్ పవార్) భవిష్యత్ పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ రెండు వర్గాలు ఒక్కటైతే, మహాయుతిలో NCP స్థానం కొనసాగుతుందా? లేక కొత్త రాజకీయ సమీకరణలకు తెరలేవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు సునేత్ర పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తే, అది కేవలం పరిపాలనా నిర్ణయంగా కాకుండా రాజకీయ సంకేతంగా భావించాల్సి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది శరద్ పవార్ వర్గానికి పంపిన సందేశమా? లేక కలయికకు ముందడుగుగా రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా పవార్ కుటుంబంలో జరుగుతున్న ఈ వరుస పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్లో ‘మహా’ కలయికకు దారి తీస్తాయా? లేక అధికార సమీకరణాల్లో కొత్త చీలికలను తెస్తాయా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. ప్రస్తుతం మాత్రం రాష్ట్ర రాజకీయాలు పవార్ కుటుంబం చుట్టూనే తిరుగుతున్నాయన్నది విశ్లేషకుల మాట.

Post A Comment: