ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ
ఫైలేరియా (బోదకాలు) వ్యాధి నివారణలో భాగంగా సామూహిక డీ.ఈ.సీ మరియు అల్బెండజోల్ మాత్రల వినియోగం పై ఉమ్మడి వరంగల్ జిల్లా లోని హనుమకొండ, వరంగల్, జనగామ మరియు మహబూబాబాద్ జిల్లా లోని వైద్య అధికారులకు మరియు సూపర్వైజర్ సిబ్బందికి ఒకరోజు పున:శ్చరణ
శిక్షణా కార్యక్రమం హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ముందుగా హనుమకొండ, వరంగల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖా అధికారులు డాక్టర్. బి. సాంబశివ రావు, డాక్టర్. వెంకట రమణ మరియు జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సునిల్ కుమార్, ప్రోగ్రాం అధికారులు జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జోనల్ మలేరియా అధికారి డాక్టర్ సునిల్ కుమార్ ఈ శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఫైలేరియా వ్యాధి తో ప్రపంచ వ్యాప్తంగా 120 మిలియన్ల ప్రజలు, భారత దేశంలో 31 మిలియన్ల ప్రజలు మరియు తెలంగాణ రాష్ట్రం లో 66,658 ప్రజలు భాద పడుతున్నారని తెలుపుతూ ప్రపంచ వ్యాప్తంగా మరియు భారత దేశంలో 2030 సo. నాటికి ఈ వ్యాధిని నిర్మూలించడానికి 2004 సo. లో సామూహిక డీ.ఈ.సీ ఔషధ వినియోగం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 20 వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సామూహిక డీ.ఈ.సీ మరియు అల్బెండజోల్ మాత్రల వినియోగం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఇందులో ముఖ్యంగా 2 సo. లలోపు వయసున్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు మరియు దీర్ఘ కాలిక రోగులను మినహాయిoచి మిగత వారందరికి ఇంటింటికి తిరిగి, పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాలలో, హాస్టల్ లలో దగ్గరుండి మింగించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం బోధకాలు వ్యాధిగ్రస్తులు నివసించే ప్రాంతంలోని మిగత ప్రజలలో వ్యాది లక్షణాలు కనిపించనప్పటికి వారిలో ఉన్న వ్యాధి కారక క్రిమిని నిర్మూలించడానికి మరియు వ్యాధిగ్రస్తుల ద్వారా ఆరోగ్య వంతులకు సంక్రమించకుండా నివారణ కల్పించవచ్చని తెలిపారు. అందరికీ ఒకేసారి మాత్రలు మింగించడం మూలంగా ఫైలేరియా వ్యాధి క్రిములు సమాజంలో ప్రబలకుండా నిరోధిస్తుందని తెలిపారు. ఇందులో 2 సo. ల నుండి 5 సo. ల పిల్లలకి 1 మాత్ర డీ.ఈ.సీ మరియు 1 మాత్ర అల్బెండజోల్, 6 నుండి 14 సo. ల లోపు పిల్లలకి 2 మాత్రలు డీ.ఈ.సీ మరియు 1 మాత్ర అల్బెండజోల్, 15 మరియు ఆపైన వయసున్న వ్యక్తులకు 3 మాత్రలు డీ.ఈ.సీ మరియు 1 మాత్ర అల్బెండజోల్ మింగించడం జరుగుతుందని తెలిపారు. అల్బెండజోల్ మాత్రను సప్పరించి మింగవలసి ఉంటుందన్నారు. ఫైలేరియా వ్యాది కేవలం కాళ్లకే పరిమితం కాకుండా శరీరంలోని ఇతర భాగలైన చేతులు, పురుషాంగం మరియు రొమ్ములలో కూడా సోకవచ్చు కావున ప్రతి ఒక్కరూ ఈ మాత్రలను తప్పకుండ వేసుకోవాలని తెలిపారు.
హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్. బి. సాంబశివ రావు మాట్లాడుతూ బోధకాలు వ్యాధి ముఖ్యంగా వ్యాధిగ్రస్తుల నుండి క్యూలెక్స్ ఆడ దోమల ద్వారా మిగత వారికి వ్యాపిస్తుందని కావున దోమలు కుట్టకుండా మరియు పుట్టకుండా సరియైన జాగ్రత్తలు తీసుకోవాలని మురికి నీటి గుంటలను పూడ్చి వేయాలని తెలుపుతూ హనుమకొండ జిల్లాలోని కొండపర్తి, ఐనవోలు, ఆత్మకూరు, మరియు ధర్మసాగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని సిబ్బందికి వెంటనే శిక్షణ ఇచ్చి, ఇతర ప్రభుత్వ విభాగాల సహకారంతో ఈ నెల 20 వ తేదీన జరుగబోయే సామూహిక ఔషధ డీ.ఈ.సీ మరియు అల్బెండజోల్ వినియోగ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేర్కొన్నారు.వరంగల్ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖాధికారి డాక్టర్. వెంకట రమణ మాట్లాడుతూ బోధకాలు
వ్యాధిని నిర్మూలించటానికి వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు ఇతర శాఖల సిబ్బంది సహకారంతో కృషి చేయాలని ఈ మాత్రలు ఉపయోగించినపుడు ఎవరికైనా చిన్న చిన్న ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదురైనప్పటికి 1,2 రోజులలో సర్దుకుంటాయని కావున వీటి యొక్క ప్రయోజన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ తప్పకుండ మాత్రలు మింగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిష్ నల్ డిఎంహెచ్‌ఓ డాక్టర్. టి. మదన్ మోహన్ రావు, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ. డాక్టర్. యాకూబ్ పాషా, వరంగల్ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ మధుసూదన్, డిప్యూటీ డిఎంహెచ్‌ఓ. డాక్టర్ గోపాల్ రావు, హనుమకొండ జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, ఎంటమాలజిస్ట్ చంద్ర శేఖర్, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, మాధవ రెడ్డి, రమేశ్, సబ్ యూనిట్ అధికారులు లింగమూర్తి, విజయేందర్ రెడ్డి, జ్యోతి, శిరీష్ మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు మరియు సూపర్ వైజర్ సిబ్బంది పాల్గొన్నారు.


Post A Comment: