జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామంలోని రైతు వేదిక ప్రాంగణంలో ఆత్మ (ATMA) 2026-27 వార్షిక ప్రణాళికలో భాగంగా నాలుగో రైతు బడి (ఫార్మర్ ఫీల్డ్ స్కూల్ – FFS) సమావేశాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, పంటల సాగులో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఎన్‌ఎంఎన్‌ఎఫ్ రాష్ట్ర సమన్వయకర్త రాజేష్, జిల్లా సమన్వయకర్త మణికుమార్, కాటారం మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ, రేగులగూడెం వ్యవసాయ విస్తరణ అధికారి అస్మా హాజరయ్యారు. ఎంపిక చేసిన 25 మంది రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే ఘనజీవామృతం, ద్రవజీవామృతం, జీవామృతం తయారీ విధానాలను నిపుణులు రైతులకు వివరించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ, సహజ సిద్ధమైన వ్యవసాయ పద్ధతులను అనుసరించడం ద్వారా నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు. రైతులు వరి సాగుతో పాటు తృణధాన్యాలు, అపరాల సాగుపై దృష్టి సారించాలని, పంట మార్పిడి విధానాలను అనుసరించడం ద్వారా వ్యవసాయంలో స్థిరమైన దిగుబడులు సాధించవచ్చని అవగాహన కల్పించారు. అనంతరం సమగ్ర పోషక యాజమాన్యంలో భాగంగా వరి పంటకు డ్రోన్ ద్వారా నానో యూరియా పిచికారీ చేసే విధానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించారు. గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు దోమ రవీందర్ (తండ్రి బ్రహ్మయ్య) పొలంలో ఈ ప్రదర్శన నిర్వహించారు. వరి పంటలో కీలక దశల్లో నానో యూరియాను డ్రోన్ సాయంతో పిచికారీ చేసే విధానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయగల విధానాన్ని రైతులకు వివరించారు. ఈ రైతు బడి సమావేశం ద్వారా ఒకవైపు ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై, మరోవైపు ఆధునిక వ్యవసాయ సాంకేతికత వినియోగంపై రైతులకు అవగాహన లభించింది. రైతులు శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ, తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించే దిశగా ముందుకు సాగాలని కార్యక్రమంలో సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, సమన్వయకర్తలు, రైతులు పాల్గొన్నారు.


Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: