జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తులు, గణేష్ విగ్రహాల వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా టీజీఎన్‌పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్, భూపాలపల్లి సర్కిల్ నోడల్ అధికారి శ్రీమతి అన్నపూర్ణ కాటారం డివిజన్ పరిధిలోని నిమజ్జన మార్గాలను పరిశీలించారు.
కాటారం, మహాదేవపూర్, కాళేశ్వరం మార్గాల మీదుగా గణేష్ విగ్రహాలను తరలించే వాహనాలు ప్రయాణించే సమయంలో విద్యుత్ లైన్లు అడ్డంకిగా మారకుండా అధికారులు ప్రత్యేకంగా పరిశీలించారు. రహదారుల వెంట ఉన్న విద్యుత్ లైన్లను పరిశీలించి, విగ్రహాల వాహనాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిమజ్జనం సందర్భంగా విద్యుత్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కడైనా విద్యుత్ లైన్లు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతరం కాళేశ్వరం గోదావరి నది వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమానికి వచ్చే భక్తులు, వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో భూపాలపల్లి సర్కిల్ ఎస్‌ఈ సదానందం, డీఈ టెక్నికల్ జగదీష్, కాటారం డీఈ నాగరాజు, కాటారం–మహాదేవపూర్ ఏఈ రమేష్, మహాదేవపూర్ సబ్‌ఇంజినీర్ ప్రశాంత్, కాళేశ్వరం లైన్ ఇన్‌స్పెక్టర్ సదానందం, విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
గణేష్ నిమజ్జనం సందర్భంగా ప్రజలకు, భక్తులకు ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే లక్ష్యంగా అధికారులు మార్గాలను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.



Post A Comment: