భూపాలపల్లి: అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 1 వరకు వయోవృద్ధుల వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వయోవృద్ధుల సంక్షేమం, రక్షణ, గౌరవప్రదమైన జీవనానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007పై ప్రజలు, కుటుంబ సభ్యులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వయోవృద్ధులకు అవసరమైన సహాయం, భద్రత, సంక్షేమ సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
వయోవృద్ధులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. కుటుంబ సభ్యులు, సమాజం వయోవృద్ధుల పట్ల గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలని కోరారు.
వారోత్సవాల్లో భాగంగా వయోవృద్ధుల హక్కులు, ఆరోగ్యం, భద్రత, సామాజిక భద్రత, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, చట్టపరమైన రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి జి. మల్లేశ్వరి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, సంక్షేమ శాఖ జూనియర్ అసిస్టెంట్ అర్జున్, డే కేర్ సెంటర్ సూపరింటెండెంట్ కొలగూరి సంజీవరావు, సీనియర్ సిటీజన్స్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: