కాటారం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ యువతి ఊకె శిరీషపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనను ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) తీవ్రంగా ఖండించింది. ఈ ఘటన అత్యంత దారుణమని తుడుం దెబ్బ జిల్లా నాయకుడు, కాటారం మండలం జాదరావుపేట ఉప సర్పంచ్ కోట అశోక్ పేర్కొన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. కుటుంబానికి పూర్తి భద్రత కల్పించి, కేసులో సాక్ష్యాలు తారుమారు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివాసీ ఆడబిడ్డల రక్షణకు ప్రత్యేక చట్టం, ప్రత్యేక పోలీస్ సెల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. శిరీషకు న్యాయం జరిగే వరకు తుడుం దెబ్బ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు, రాస్తారోకోలు చేపడతామని, న్యాయం జరగకపోతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బంద్‌కు పిలుపునిస్తామని తెలిపారు. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోట అశోక్ కోరారు.

Post A Comment: