చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాబుపేట శాంతినగర్ గ్రామ పరిధిలో గుట్టలను అక్రమంగా తవ్వి మట్టి, గ్రావెల్ తరలిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అనుమతులు లేకుండానే రాత్రి వేళల్లో భారీ యంత్రాలతో తవ్వకాలు చేపట్టి లారీల ద్వారా మట్టి తరలిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్, చిట్యాల మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు గత 15 రోజులుగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. పలుమార్లు మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకుని అనుమతులు చూపించాలని కోరినప్పటికీ సరైన సమాధానం ఇవ్వకుండా తమను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. పట్టా భూమి అయినప్పటికీ గుట్టల తవ్వకాలకు పర్యావరణ అనుమతులు, వాల్టా చట్టం ప్రకారం అవసరమైన అనుమతులు ఉండాలని రవి పటేల్ పేర్కొన్నారు.
జిల్లా మైనింగ్, రెవెన్యూ అధికారులను సంప్రదించగా అనుమతులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ, తవ్వకాల ప్రదేశంలో సరైన బోర్డులు, లారీ పాసులు, ప్రజలకు సమాచారం వంటి అంశాలు కనిపించడం లేదని ఆరోపించారు. లారీలు రాకపోకలు సాగించడంతో రోడ్లపై భారీగా దుమ్ము లేస్తోందని, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు తెలిపారు. రోడ్లపై నీటిని చల్లకపోవడంతో వాయు కాలుష్యం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాల వల్ల గుట్టలు ధ్వంసమై పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని టీఆర్‌పీ నాయకులు పేర్కొన్నారు. భూసార నష్టం, భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం, గ్రామ ప్రజల జీవన విధానంపై దుష్ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. జిల్లా కలెక్టర్, మైనింగ్, రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి తవ్వకాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని కూడా రికవరీ చేయాలని కోరారు. అధికారులు స్పందించకపోతే స్థానిక ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రవి పటేల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌పీ చిట్యాల మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Post A Comment: