కాటారం, ఆగస్టు 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో విధించిన నిబంధనలను వెంటనే సవరించి, ఒక్కో ఇంటికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దుబాసి పార్వతి డిమాండ్ చేశారు. శుక్రవారం కాటారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత నిర్మాణ సామగ్రి ధరలు, కూలీల ఖర్చులు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రూ.5 లక్షలతో పూర్తి స్థాయి ఇల్లు నిర్మించడం సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. పేదలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు అప్పులు చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు 400–600 చదరపు అడుగుల విస్తీర్ణ పరిమితి విధించడం వల్ల భవిష్యత్ అవసరాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఆ పరిమితిని కనీసం 1000 చదరపు అడుగులకు పెంచాలని కోరారు. ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా బిల్లుల మంజూరులో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మంత్రుల నివాసాల మరమ్మతులకు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, పేదలకు ఇల్లు నిర్మించేందుకు మాత్రం రూ.5 లక్షలు మాత్రమే కేటాయించడం సమంజసం కాదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని రూ.10 లక్షలకు పెంచడంతో పాటు నిబంధనలను సవరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి అయితే బాపు, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు బూడిది లావణ్య, నాయకులు మంథని మల్లేష్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: