భూపాలపల్లి: తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బీసీ ముదిరాజ్ ముద్దుబిడ్డ, పోరాట యోధుడు ఎర్ర సత్యం అన్న జయంతి వేడుకలను జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్‌తో పాటు నాయకులు ఎర్ర సత్యం అన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ.. ఎర్ర సత్యం అన్న తన జీవితాన్ని పేద ప్రజల సేవకు అంకితం చేశారని కొనియాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తూ, తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ తన వంతు సహాయాన్ని అందించారని తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో ప్రజల ఆదరణ పొందిన నాయకుడిగా ఎర్ర సత్యం అన్న గుర్తింపు పొందారని పేర్కొన్నారు. పేద ప్రజల గుండెల్లో నమ్మకాన్ని సంపాదించుకున్న అలాంటి ప్రజానాయకుడిని కొందరు వ్యక్తులు కక్షపూరిత ధోరణితో హత్య చేయడం అత్యంత బాధాకరమని రవి పటేల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్ర సత్యం అన్న ఆశయాలు, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రటరీ పిట్టల వెంకటేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు సామల శ్రీలత, క్రమశిక్షణ కమిటీ నాయకుడు కరుణాకర్, కార్మిక విభాగం నాయకుడు అనంతుల సంపత్, ఎలక్ట్రిషియన్ విభాగం నాయకుడు అశోక్, జిల్లా నాయకులు సమ్మయ్య, రాంబాబు, సలీం, రమేష్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: