పరకాల, మే 11: కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమవుతున్న నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి బొట్ల చక్రపాణి డిమాండ్ చేశారు. సోమవారం భూపాలపల్లి రోడ్డులోని న్యూ భాస్కర్ సిమెంట్ అండ్ ఐరన్ దుకాణం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో లేబర్ కోడ్‌ల ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బొట్ల చక్రపాణి మాట్లాడుతూ.. కార్మిక వర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ లేబర్ కోడ్‌లను తీసుకొచ్చిందని ఆరోపించారు. 2020లోనే పార్లమెంటులో ఆమోదించిన ఈ కోడ్‌లను దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల నేపథ్యంలో అమలు చేయకుండా తాత్కాలికంగా నిలిపివేసిందని తెలిపారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఈ కోడ్‌ల అమలుకు ముందుకొచ్చిందని, ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత వాటిని నోటిఫై చేయడం కార్మిక వ్యతిరేక చర్యగా అభివర్ణించారు. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపడుతున్న ఆందోళనలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్‌లు కార్మికుల సంక్షేమం కోసం కాదని, కార్పొరేట్ సంస్థలకు శ్రమ దోపిడీకి మార్గం సుగమం చేయడానికేనని ఆయన ఆరోపించారు. వీటి రద్దు కోసం కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బొచ్చు ఆదాం, కృష్ణంరాజు, సాంబయ్య, గణేష్, వేణు, ఓంకార్, రాజు, రమేష్, మొగిలి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: