జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఏప్రిల్ 25: భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, కార్పొరేటర్ చాడ స్వాతి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి వన్నాల వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, మహిళా సాధికారత, దేశంలో జరుగుతున్న తాజా పరిణామాలు మరియు కాంగ్రెస్ పార్టీ వైఖరిపై విస్తృతంగా మాట్లాడారు. మహిళల సాధికారతకు అత్యంత కీలకమైన సమయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రదర్శించిందని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లును అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ మహిళల ఆశయాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ‘మహిళా రిజర్వేషన్ చట్ట సవరణ బిల్లు-2026’ను ప్రవేశపెట్టిందని, 2029 నాటికి అమలు చేయాలనే లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అడ్డుకోవడం అన్యాయమని పేర్కొన్నారు. మహిళా సాధికారతపై పెద్దలు మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల అసలు వైఖరి పార్లమెంటులో బయటపడిందని, ఇది మహిళా వ్యతిరేక కూటమిగా స్పష్టమవుతోందని అన్నారు. మహిళలకు సముచిత ప్రతినిధిత్వం కల్పించే చారిత్రాత్మక నిర్ణయాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినా, రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ ఈ బిల్లును అడ్డుకుందని ఆరోపించారు. గతంలో కూడా కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ విషయంలో నిర్లక్ష్య వైఖరినే చూపిందని విమర్శించారు. మహిళల హక్కులను అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ మరియు మిత్రపక్షాలు ఏకమయ్యాయని, భవిష్యత్తులో మహిళలు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరించారు. మహిళా సాధికారతే దేశ అభివృద్ధికి పునాదిగా భావిస్తూ, మహిళల గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో-కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు దొంగల రాజేందర్, పెండ్యాల రాజు, రాష్ట్ర నాయకులు బట్టు రవి, అర్బన్ అధ్యక్షుడు గీస సంపత్, కౌన్సిలర్ ఎరుకల రేణుక, మీడియా ఇంచార్జ్ మునీందర్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గాలిఫ్, మహిళా మోర్చా నాయకురాలు బూర పద్మ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: