జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల మూడవ రోజు సమ్మెకు మద్దతుగా ఈరోజు భారీ నిరసన ర్యాలీ నిర్వహించబడింది. ఈ సందర్భంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల హక్కుల కోసం నర్సంపేటలో శంకర్ గౌడ్ అనే కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. ఈ ఘటనకు నిరసనగా ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే నల్గొండ, భూపాలపల్లి జిల్లాల్లో పలువురు కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. మరణించిన శంకర్ గౌడ్ కుటుంబానికి తక్షణమే రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు అడుగుతున్నవి తమ స్వంత డిమాండ్లు కాకుండా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నారని తెలిపారు. కార్మికులు ఉంచిన 30 డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి అమలు చేయాలని కోరారు. లేదంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్మికులకు ఏ సమస్య వచ్చినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ అండగా నిలుస్తుందని, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తీన్మార్ మల్లన్న నేతృత్వంలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. “కార్మికులు లేనిదే ఏ ప్రభుత్వం నిలవదు. ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరం. వెంటనే కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే రాస్తారోకాలు, పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాం” అని ప్రభుత్వం ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా కార్మిక మరియు ఉపాధ్యక్షుడు అనంతుల సంపత్ బొట్టు, జిల్లా కోశాధికారి జినూకల శ్రీను, జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, జిల్లా క్రమశిక్షణ కమిటీ అధ్యక్షుడు గండు కరుణాకర్, జిల్లా నాయకులు రాజేందర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొని కార్మికులకు మద్దతు తెలిపారు.


Post A Comment: