ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతులు పంటల సాగుకు ముందు భూసార పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. నేల ఆరోగ్య కార్డుల ద్వారా భూమిలో ఉన్న పోషక విలువలను తెలుసుకొని, పంటకు అవసరమైన ఎరువులను సరైన మోతాదులో వినియోగించుకోవచ్చని వివరించారు. దీనివల్ల సాగు ఖర్చులు తగ్గడంతో పాటు భూసారం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చని సూచించారు.
అదేవిధంగా నేల సారాన్ని పెంపొందించేందుకు జీలుగు వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. పచ్చిరొట్ట ఎరువుల వినియోగం వల్ల భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి, నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని వివరించారు. కూరగాయల సాగులో ఆధునిక పద్ధతులను అనుసరించడంతో పాటు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
వేప నూనె పిచికారీపై ప్రత్యక్ష ప్రదర్శన
శిక్షణా కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన ప్రగతిశీల రైతు దోమ తిరుపతి (తండ్రి రాజయ్య) వరి పొలంలో వేప నూనె పిచికారీ చేసే విధానంపై వ్యవసాయ అధికారులు ప్రత్యక్ష ప్రదర్శన నిర్వహించారు. వేప నూనె వినియోగం, పంటల సంరక్షణలో దాని ఉపయోగాలు, పిచికారీ చేసే విధానం గురించి రైతులకు వివరించారు. రైతులు క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారా ఈ విధానంపై అవగాహన పొందారు.
రైతులు వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ సాగు చేపట్టాలని, అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. రైతు క్షేత్ర బడి శిక్షణా కార్యక్రమాల ద్వారా రైతులకు వ్యవసాయంపై మరింత అవగాహన పెంపొందించడంతో పాటు సాగులో ఎదురయ్యే సమస్యలకు పరిష్కార మార్గాలు తెలుసుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాటారం మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమ, గ్రామ ఉప సర్పంచ్, ప్రదర్శన పొలం రైతు దోమ తిరుపతి, రైతు క్షేత్ర బడి కార్యక్రమం ద్వారా ఎంపికైన రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు), తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: