మహాముత్తారం, ( మేడిగడ్డ టీవీ న్యూస్ ) : రైతులు శాస్త్రీయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులు సాధించడంతో పాటు సాగు ఖర్చులను తగ్గించుకునేలా వ్యవసాయ శాఖ–ఆత్మ ఆధ్వర్యంలో పొలం బడి (ఫామ్ స్కూల్) కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం మహాముత్తారం మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కే. మదన్‌మోహన్ రెడ్డి పాల్గొని రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భూసార పరీక్షల ప్రాధాన్యత, నేల ఆరోగ్యం పరిరక్షణ, భూమిలోని పోషకాల స్థాయిని తెలుసుకొని పంటలకు అవసరమైన ఎరువులను సమతుల్యంగా వినియోగించుకోవాల్సిన విధానాలపై రైతులకు వివరించారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించడంతో పాటు పంటల దిగుబడిని పెంచుకోవచ్చని సూచించారు. వరిలో విత్తన శుద్ధి ప్రాముఖ్యతను వివరిస్తూ, విత్తనాల ద్వారా వ్యాపించే తెగుళ్లను ముందుగానే నియంత్రించేందుకు విత్తన శుద్ధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. పంట ప్రారంభ దశ నుంచే ఆరోగ్యకరమైన మొక్కల పెరుగుదలకు విత్తన శుద్ధి దోహదపడుతుందని పేర్కొన్నారు. అలాగే పంటల్లో చీడపీడలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి నివారణకు సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలని రైతులకు సూచించారు. అవసరం లేకుండా పురుగుమందులను వినియోగించకుండా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సరైన మందులను, సరైన మోతాదులో వినియోగించాలని తెలిపారు. పంటలను నిరంతరం పరిశీలిస్తూ తెగుళ్లను ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. వ్యవసాయ రంగంలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, శాస్త్రీయ పద్ధతులను పాటించడం ద్వారా అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన పంట ఉత్పత్తిని సాధించవచ్చని డాక్టర్ కే. మదన్‌మోహన్ రెడ్డి తెలిపారు. అనంతరం రైతులకు ఫామ్ స్కూల్ కిట్లను అందజేశారు. పొలం బడి కార్యక్రమాల ద్వారా రైతులకు పంటల సాగులో ఎదురయ్యే సమస్యలపై నిపుణుల సూచనలు అందడంతో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ప్రత్యక్ష అవగాహన కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. అనుష, వ్యవసాయ విస్తరణ అధికారులు ప్రవళిక, శివకృష్ణ, శశివర్ధన్, కార్యదర్శి శ్రీకాంత్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అందిస్తున్న సాంకేతిక సూచనలు, శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని అధికారులు సూచించారు.

Post A Comment: