November 2026
Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, నవంబర్ 2 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారుల ద్వారా చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రజావాణికి మండల స్థాయి వివిధ శాఖలకు చెందిన మొత్తం 16 మంది అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను అధికారులు స్వీకరించారు. ఐసీడీఎస్ శాఖకు సంబంధించి ఒక దరఖాస్తు అందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు.

ఈ సందర్భంగా నోడల్ అధికారి, ఎంపీడీవో అడ్డూరి బాబు మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఆయా శాఖల అధికారులు దరఖాస్తుల్లో పేర్కొన్న సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు.

ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి కార్యక్రమం ద్వారా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో నోడల్ అధికారి, ఎంపీడీవో అడ్డూరి బాబు, మండల తహసీల్దార్ నాగరాజు, వివిధ శాఖలకు చెందిన 16 మంది మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాళేశ్వరం, నవంబర్ 2 మేడిగడ్డ టీవీ న్యూస్ : మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రాజేష్ అగర్వాల్, గడ్చిరోలి జిల్లా కలెక్టర్ అవిశాంత్ పాడే సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాళేశ్వరం చేరుకున్న మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్, గడ్చిరోలి జిల్లా కలెక్టర్ అవిశాంత్ పాడేలకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం అభిషేక మండపంలో అర్చకులు వారికి వేదమంత్రాలతో ఆశీర్వచనం అందించారు. స్వామివారి శేషవస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.


గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి

అనంతరం వారు సరస్వతీ పుష్కర ఘాట్‌ను సందర్శించారు. రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో కాళేశ్వరం ప్రాంతంలో చేపట్టాల్సిన ఏర్పాట్లు, పుష్కరాల ప్రాధాన్యత, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాల గురించి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ వారికి వివరించారు. పుష్కరాల నిర్వహణకు సంబంధించి ప్రాంతీయంగా ఉన్న ప్రాధాన్యతను, ఘాట్‌ల అభివృద్ధి అంశాలను వివరించారు.


ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన

అనంతరం పునర్నిర్మాణంలో ఉన్న శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులను మహారాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేష్ అగర్వాల్, గడ్చిరోలి జిల్లా కలెక్టర్ అవిశాంత్ పాడే పరిశీలించారు. ఆలయ పునర్నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాణ పనుల తీరును పరిశీలించి, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ పర్యటనలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో పాటు పలువురు జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

ప్రతాపగిరి, నవంబర్ 2 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయతీలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సాగుభూమి సంరక్షణ (ఖేత్ బచావో అభియాన్)పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) పి. శ్రీకన్య ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్ రాజయ్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా ఏఈఓ శ్రీకన్య మాట్లాడుతూ.. నేల ఆరోగ్యంగా ఉంటేనే రైతు అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 'స్వస్థ ధరా – సమృద్ధ కిసాన్' నినాదానికి అనుగుణంగా ప్రతి రైతు తప్పనిసరిగా తమ పొలాల్లో భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరానికి మించి రసాయన ఎరువులను వినియోగించకుండా, పశువుల ఎరువులు, పచ్చిరొట్ట ఎరువుల వాడకాన్ని పెంచాలని కోరారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ సాగు ఖర్చులను తగ్గించుకోవాలని వివరించారు.

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు సూచనలు.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై కూడా రైతులకు అవగాహన కల్పించారు. ఎల్‌నినో కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటల వైపు రైతులు దృష్టి సారించాలని తెలిపారు.

అనంతరం గ్రామ సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్ రాజయ్య మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ అధికారులు అందిస్తున్న సలహాలు, సూచనలను రైతులందరూ పాటించాలని కోరారు. సాగుభూమిని సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, భూమి సారాన్ని కాపాడుతూ రాబోయే తరాలకు ఆరోగ్యకరమైన భూములను అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు అందించిన సూచనలను అడిగి తెలుసుకున్నారు.


Stay Updated With Medigadda Tv News For The Latest News' Politics, Crime, Business And More From South India's Latest News Day To Day

కాటారం, నవంబర్ 2 మేడిగడ్డ టీవీ న్యూస్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని కాటారం గొల్లవాడ, గారెపల్లి గొల్లవాడ, బొమ్మనవాడ, గంటవాడ, కొత్తపల్లి గ్రామాల్లో ఆరు నెలలలోపు వయస్సు గల దూడలకు నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దూడలకు నట్టల నివారణ మందును నోటి ద్వారా తాగించారు.

పశువైద్యాధికారి డాక్టర్ జి. రమేష్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు. దూడల పేగుల్లో ఉండే నట్టల వల్ల వాటి ఎదుగుదల మందగించడం, బరువు పెరగకపోవడం, రక్తహీనత, నీరసం, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఈ సందర్భంగా వివరించారు. పశువైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు తాగించడం ద్వారా దూడలు ఆరోగ్యంగా ఎదిగేందుకు దోహదపడుతుందని తెలిపారు.

రైతులు దూడల వయస్సు, బరువుకు అనుగుణంగా పశువైద్యుల సూచన మేరకు సరైన మోతాదులో మందులు తాగించాలని సూచించారు. పశువుల పాకలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు నాణ్యమైన మేత, శుభ్రమైన తాగునీరు అందించాలని కోరారు. దూడల్లో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప పశువైద్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కాటారం గ్రామ సర్పంచ్ పంతకాని సడవలి, మొదటి వార్డు సభ్యుడు రవి, పశువైద్య సహాయకుడు రాజశేఖర్, ఓఎస్ సుల్తానా బేగం, ఓఎస్ రాజబాబు, పశుమిత్ర నజీమా, గోపాలమిత్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.