మహా ముత్తారం, ఆగస్టు 13: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్నా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన యూనిఫాంలు పంపిణీ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆగస్టు 15 వేడుకలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు కొత్త దుస్తులు అందకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అంశంపై కుల సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ పీక కిరణ్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థులకు యూనిఫాంల పంపిణీలో ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు వారం, పది రోజుల ముందుగానే విద్యార్థులకు నూతన యూనిఫాంలు అందించేవారని, ఈసారి మాత్రం ఆగస్టు 15 సమీపిస్తున్నా పంపిణీ జరగకపోవడం బాధాకరమన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం అంటే ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన రోజని, ఆ రోజు కొత్త యూనిఫాం ధరించి పాఠశాలకు వెళ్లాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుకుంటారని కిరణ్ పేర్కొన్నారు. కానీ యూనిఫాంలు అందకపోవడంతో విద్యార్థులు పాత దుస్తులతోనే పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “ఆగస్టు 15న మన పిల్లలు పండుగ వాతావరణంలో కొత్త యూనిఫాంలు వేసుకుని స్కూళ్లకు వెళ్లాలా? లేక పాత బట్టలతోనే వెళ్లాలా? విద్యార్థులకు యూనిఫాంలు అందించడంలో ఇంత జాప్యం ఎందుకు జరుగుతోంది? విద్యాశాఖ అధికారులు నిద్రమత్తులో ఉన్నారా?” అంటూ పీక కిరణ్ ప్రశ్నించారు. విద్యార్థుల విషయంలో అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో విద్యార్థులకు కనీస అవసరమైన యూనిఫాంలు సైతం సకాలంలో అందకపోవడం ఆ మాటలకు విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఆగస్టు 15 వేడుకలకు ముందు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నూతన యూనిఫాంలు అందేలా విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని పీక కిరణ్ డిమాండ్ చేశారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం, అధికారులు సమన్వయంతో పనిచేసి యూనిఫాంల పంపిణీ ప్రక్రియను అత్యవసరంగా పూర్తి చేయాలని కోరారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రతి విద్యార్థి గౌరవంగా, ఆనందంగా పాఠశాల వేడుకల్లో పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

Next
This is the most recent post.
Previous
Older Post
Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: