కాటారం, జూలై 31 : కాటారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం ప్రత్యేక అధికారి పీ. బాలకృష్ణ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. సమావేశానికి ఏఎంసీ చైర్‌పర్సన్, పీఏసీఎస్ చైర్మన్, మండలంలోని సర్పంచులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. సమావేశంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల పురోగతిపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ప్రత్యేక అధికారి సూచించారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించడం వల్ల గ్రామాల్లో నెలకొనే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అలాగే బయ్యారం, ప్రతాపగిరి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు పంటను దూర ప్రాంతాలకు తరలించాల్సిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున స్థానికంగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో గంజాయి వినియోగం, బెల్ట్ షాపుల నిర్వహణ పెరుగుతున్నట్లు సమావేశంలో సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు, అక్రమ మద్యం విక్రయాలను అరికట్టేందుకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశంలో వివిధ గ్రామాల అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించి, ఆయా శాఖల అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు.

Post A Comment: