భూపాలపల్లి, జూలై 24: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)ను రద్దు చేసి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. టీఆర్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపు మేరకు రవి పటేల్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల బంద్ నిర్వహించారు. బంద్‌కు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం భూపాలపల్లి అంబేద్కర్ కూడలిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవి పటేల్ మాట్లాడుతూ.. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీపై విద్యార్థులు 23 రోజులుగా దేశవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా అణచివేతకు పాల్పడటం సరికాదన్నారు. విద్యార్థుల సమస్యలపై స్పందించకపోతే ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని పేర్కొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్‌టీఏ వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావంగా టీఆర్పీ ఆధ్వర్యంలో భూపాలపల్లి జిల్లాలో విద్యాసంస్థల బంద్ నిర్వహించినట్లు తెలిపారు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు బాధ్యత వహిస్తూ ఎన్‌టీఏను రద్దు చేయడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్పీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని రవి పటేల్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ ఖమ్మం జిల్లా ఇన్‌చార్జ్ గట్ల రాజన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు సామల శ్రీలత, వ్యవసాయ శాఖ జిల్లా అధ్యక్షుడు పింగిడి శంకరయ్య, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రామ్ చరణ్, గునికంటి విష్ణు, ప్రణీత్, శ్రీకాంత్, రాజేష్, రోడ్డ శ్రీనివాస్, నరేష్, రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.




Post A Comment: