భూపాలపల్లి, జూన్ 10: అటవీ భూముల వ్యవహారంలో అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నిమ్మగూడెం బిట్ అధికారి శ్రీకాంత్, రెడ్డిపల్లి బిట్ అధికారి అఖిల్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కుల సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (సీసీఎఫ్)కు ఫిర్యాదు అందజేశారు. నిమ్మగూడెం పరిధిలో గత రెండు సంవత్సరాలుగా సుమారు 400 ఎకరాల అటవీ భూమిని అక్రమంగా విక్రయించేందుకు అధికారులు సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సంబంధిత అధికారులను విధుల నుంచి తొలగించాలని కోరారు. అటవీ శాఖలో నియంత్రణ లేకుండా అవినీతి జరుగుతోందని ఆరోపించిన నాయకులు, ఈ అంశాలపై అటవీ శాఖ ఉన్నతాధికారులు, కమిషనర్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అజ్మీరా పూల్‌సింగ్ నాయక్, పీక కిరణ్, లవుడియా తిరుపతి నాయక్, దేవేందర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: