పెద్దపల్లి, మే 31: పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్న ఆర్టీసీ బస్ డిపో పనులను వేగవంతం చేసి త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రతిపాదిత బస్ డిపో స్థలాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ విజయ రమణారావుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ విజయ రమణారావు, మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి పెద్దపల్లికి ఆర్టీసీ బస్ డిపోను మంజూరు చేశారని తెలిపారు. డిపో పనులు కొంత ఆలస్యమైనప్పటికీ ప్రస్తుతం వాటిని వేగవంతం చేసి త్వరలో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు బస్సు కనెక్టివిటీని మరింత మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల డిమాండ్ పెరిగిందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్టీసీ బస్సుల కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని, ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. కార్మికులు ఎలాంటి అపోహలకు లోనుకావద్దని సూచించారు. ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులు, 40 మంది ఆర్టీసీ ప్రతినిధులతో చర్చలు జరిపి కార్మికులకు 11 శాతం పీఆర్సీ మంజూరు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నామని, ఎన్నికైన ప్రతినిధులతో చర్చించి భవిష్యత్తులో ఆర్టీసీ విలీన ప్రక్రియను చేపట్టనున్నట్లు వెల్లడించారు. విలీన ప్రక్రియలో ఎలాంటి వివాదాలు, అడ్డంకులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, కార్మికులు అనవసర ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Post A Comment: