జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని బేగ్లూర్ గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తున్న స్థావరంపై మహదేవపూర్ పోలీసులు దాడి చేశారు. కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ప్రత్యేకంగా దాడి చేపట్టారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, పోలీసులను గమనించిన మరో ఆరుగురు అక్కడి నుంచి పరారయ్యారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన పిడుగు తిరుపతి, మల్హర్ మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన కవేటి రమేష్‌ను పోలీసులు పట్టుకున్నారు. కాగా బేగ్లూర్ గ్రామానికి చెందిన కారు గణేష్, కారు శ్రీకాంత్, కొయ్యాల దాసు, ఆకుల వెంకన్న, కారు మల్లయ్యతో పాటు సూరారం గ్రామానికి చెందిన రాకేష్ పోలీసుల రాకను గమనించి పరారైనట్లు తెలిపారు.

కోడి పుంజులు, ద్విచక్ర వాహనాలు స్వాధీనం

దాడి సమయంలో కోడిపందేల నిర్వహణకు సంబంధించిన రెండు మొబైల్ ఫోన్లు, రూ.500 నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, మూడు కోడి పుంజులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో ఒకటి రెడ్‌మీ, మరొకటి వివో ఫోన్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఎనిమిది మందిపై కేసు

ఈ ఘటనకు సంబంధించి పట్టుబడిన ఇద్దరు వ్యక్తులతో పాటు పరారైన మరో ఆరుగురిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు మహదేవపూర్ పోలీసులు తెలిపారు. పరారైన వ్యక్తుల కోసం గాలింపు చేపట్టినట్లు పేర్కొన్నారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దు

కోడిపందేలు, జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. గ్రామాల్లో ఎక్కడైనా ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే 8712658116 లేదా డయల్ 112కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించే వారి పేర్లు, వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని మహదేవపూర్ పోలీసులు తెలిపారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: