ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్:
హనుమకొండ జిల్లా లోపీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో విద్యార్థినులకు స్వీయ రక్షణకు సంబంధించి కరాటే, తదితర మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కార్యక్రమాల నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని డాక్టర్ పీవీ రంగారావు తెలంగాణ రాష్ట్ర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి బస చేయగా బుధవారం ఉదయం ఐదు గంటల నుండి మొదలైన విద్యార్థినుల దైనందిన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినులు ఉదయం వేళ వ్యాయామం, యోగా చేయగా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి కలెక్టర్ డైనింగ్ హాలులో అల్పాహారాన్ని తీసుకున్నారు. విద్యార్థినులతో కలిసి అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల వాతావరణం చాలా బాగుందని పేర్కొన్నారు. పాఠశాలలో కళాశాలలో చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి పాఠశాలకు, కళాశాలకు అదేవిధంగా జిల్లాకు మంచి పేరుని తీసుకురావాలని ఆకాంక్షించారు. చదువుల్లోనూ, క్రీడల్లోనూ రాణించి మంచి పేరును తీసుకువస్తారని నమ్మకం ఉందన్నారు. పాఠశాలకు కావలసిన అన్ని మౌలిక వసతులను సమకూర్చుతున్నట్లు తెలిపారు. స్కూల్, క్లాస్ లీడర్ విద్యార్థినులు బ్యాడ్జీలను ధరించి హుందాగా వ్యవహరిస్తూ తమ బాధ్యతలను నిర్వర్తించాలన్నారు. విద్యార్థినులందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. పదో తరగతి విద్యార్థినులకు పరీక్ష ప్యాడ్లు, నోట్ బుక్స్ కలెక్టర్ అందజేశారు. అనంతరం మీడియాతో కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ గురుకుల పాఠశాల కళాశాలలో 95 శాతం వరకు వివిధ అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయినట్లు పేర్కొన్నారు. పది రోజుల్లో మిగతా పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం కూడా పాఠశాలలో వసతులను గురించి విద్యార్థినులతో కూడా మాట్లాడినట్లు పేర్కొన్నారు. విద్యార్థినులు అడిగిన విధంగా త్వరలోనే పాఠశాలకు మిషన్ భగీరథ నీటిని అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థినులకు పీఎం శ్రీ పథకంలో భాగంగా స్వీయ రక్షణ కార్యక్రమాలలో తర్ఫీదునిస్తున్నట్లు తెలిపారు. పీఎం శ్రీ పథకం కింద నిర్వహిస్తున్న స్వీయ రక్షణ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని పేర్కొన్నారు. స్వీయ రక్షణ కార్యక్రమంలో పాల్గొంటుండడం ద్వారా విద్యార్థినులలో మనోధైర్యం పెంపొందడంతోపాటు వ్యక్తిత్వ వికాసం కలుగుతుందన్నారు. మెనూ ప్రకారం డైట్ ను అందిస్తున్నారా లేదా అని పరిశీలించినట్లు తెలిపారు. విద్యార్థినులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి వారితో మాట్లాడి అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. హాస్టల్లో అల్పాహారం, భోజనం, సౌకర్యాలు బాగున్నాయని చెప్పారు. హాస్టల్ లో ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. కాస్మోటిక్ చార్జీలను అందిస్తున్నారా లేదా అని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ గురుకుల పాఠశాల పీఎం శ్రీ పథకం కింద ఉండడంతో గ్రంథాలయాన్ని ఏర్పాటు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురుకుల పాఠశాలలో ఉదయం, సాయంత్రం పూటల్లో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూనియర్ కళాశాల విద్యార్థినిలకు జేఈఈ, నీట్ తదితర పోటీ పరీక్షల నిర్వహించి మంచి మార్కులు సాధించేలా కృషి చేయాలని ప్రిన్సిపల్, అధ్యాపకులకు సూచించారు. క్రీడలలో రాణించే విధంగా అనేక క్రీడా పరికరాలు ఉన్నాయని, అదేవిధంగా కిచెన్ గార్డెన్ బాగుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సునీత రాణి, ప్రిన్సిపల్ అఫ్రీన్ సుల్తానా, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Post A Comment: