భూపాలపల్లి, ఏప్రిల్ 10: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అక్రమ గుడుంబా తయారిపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. మల్హర్ రావు మండలంలోని కొయ్యూరు పోలీసులు తాజాగా మెరుపు దాడులు నిర్వహించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు కొండంపేట గ్రామంలో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. దాడుల సందర్భంగా సుమారు 30 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకోగా, తయారీకి సిద్ధంగా ఉంచిన 650 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు కొయ్యూరు ఎస్సై నరేష్ వెల్లడించారు. అక్రమ మద్యం తయారీపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని పోలీసులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, గుడుంబాపై కఠిన చర్యలు తీసుకుంటున్న అధికారులు బ్లాక్‌లో అధిక ధరలకు అమ్మే బీర్, మద్యం విక్రయాలపై తగిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు స్థానికంగా వినిపిస్తున్నాయి. లైసెన్స్ ఉన్న దుకాణాల నుంచే మద్యం బయటకు వచ్చి అధిక ధరలకు అమ్ముతున్నప్పటికీ, వాటిపై కఠిన చర్యలు అరుదుగా కనిపిస్తున్నాయని ప్రజలు అంటున్నారు. గుడుంబా ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదమని అధికారులు చెబుతుండగా, బ్లాక్ మద్యం అమ్మకాలు కూడా వినియోగదారులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్రమ గుడుంబాతో పాటు బ్లాక్ మార్కెట్ మద్యం విక్రయాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Post A Comment: