ఉమ్మడి వరంగల్ :

ప్రభుత్వ లక్ష్యాలను అధికారులు కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రభుత్వ కార్యక్రమాల పై రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య, వివిధ శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. త్రాగు నీటి సరఫరా, రబీ పంటలకు సాగు నీరు , డిమాండ్ కు అనుగుణంగా విద్యుత్ సరఫరా, రేషన్ కార్డుల దరఖాస్తుల ధ్రువీకరణ, రైతు భరోసా పథకాల అమలు పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుదీర్ఘంగా చర్చించి కలెక్టర్లకు పలు సూచనలు జారీ చేశారు. విద్యుత్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ గత సంవత్సరం మార్చి నెలలో వచ్చిన అత్యధిక విద్యుత్ డిమాండ్ 15 వేల 623 మెగా వాట్లు ప్రస్తుతం ఫిబ్రవరి మాసంలోనే వస్తుందని అన్నారు. 17 వేల మెగా వాట్ల పీక్ డిమాండ్ వచ్చిన సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు జరిగాయని సీఎస్ తెలిపారు. వ్యవసాయం, గృహాలు, పరిశ్రమలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా కొనసాగాలని, అవసరమైన మేర విద్యుత్తు అందుబాటులో ఉన్నందున ఎక్కడ ఎటువంటి లోటు రావడానికి వీలు లేదని సిఎస్ పేర్కొన్నారు. 

సబ్ స్టేషన్ వారిగా అదనపు విద్యుత్ పంపిణీ తట్టుకునేలా నూతన విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ ల ఏర్పాటు పనులను ఫిబ్రవరి నెల వరకు పూర్తవుతున్నాయని సీఎస్ పేర్కొన్నారు. విద్యుత్ సరఫరా అంశంలో స్థానికంగా ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరించాలని, డిమాండ్ మేరకు విద్యుత్ సరఫరా లో ఇబ్బందులు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకుని రావాలని సి.ఎస్ కలెక్టర్లకు సూచించారు. ఫీడర్ల వద్ద సమస్యతో గత సంవత్సరం కొన్ని ఇబ్బందులు ఎదుర య్యాయని,ఈ సంవత్సరం ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని అన్నారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తినట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ 1912 కి తెలియజేయాలన్నారు. మిషన్ భగీరథ, పట్టణాలలో అమృత్ క్రింద చేపట్టిన త్రాగు నీటి స్కీం, ఇతర త్రాగు నీటి స్కీంలకు, ఆసుపత్రులకు, వ్యవసాయ ఫీడర్లకు నిరంతరాయ సరఫరా ఉండే విధంగా ప్రత్యేకంగా పరిరక్షించాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని సబ్ స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేస్తూ, అక్కడ పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని సి ఎస్ అన్నారు. రైతు భరోసా పై సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, వ్యవసాయ యోగ్యమైన భూమికి రైతు భరోసా పథకం అమలుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఇప్పటి వరకు 3 ఎకరాల వరకు రైతులకు ఎకరానికి 12 వేల రూపాయలు చొప్పున పెట్టుబడే సహాయం అందిందని, 63% పట్టాదారులు సహాయం పోందారని అన్నారు. ప్రజా పాలన గ్రామ సభలలో కొన్ని సర్వే నెంబర్ లలో కొంత మేర సాగు భూమి వ్యవసాయెతర భూమి గా నమోదైందని తమ దృష్టికి తీసుకుని వచ్చారని, నేడు వాటిని సరి చేసే అవకాశం రైతు భరోసా పోర్టల్ లో అందించామని అన్నారు. రైతు భరోసా పోర్టర్ లో మిగిలిన వ్యవసాయ భూముల నమోదు ప్రక్రియను జిల్లా కలెక్టర్లు 5 రోజులలో పూర్తి చేయాలని అన్నారు. రైతు భరోసా పై ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆ మండల వ్యవసాయ అధికారి వ్యవసాయ విస్తరణ అధికారి పరిధిలో గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలని, రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సిఎస్ పేర్కొన్నారు. యాసంగి పంటకు అవసరమైన ఎరువులు సంపూర్ణంగా అందుబాటులో ఉన్నాయని, జిల్లాలలో ప్రతి మండలంలో అవసరమైన ఎరువుల స్టాక్ ఉండే విధంగా కలెక్టర్ పర్యవేక్షించాలని అన్నారు. జిల్లాలలో ఎక్కడైనా అవసరం ఉంటే వెంటనే సంప్రదించాలని, ఎక్కడైనా ప్యాక్ (పి.ఎ.సి.ఎస్) దగ్గర స్టాక్ లేకపోతే వెంటనే స్టాక్ అందించేలా చూడాలని అన్నారు. యాసంగి సాగు నీటి సరఫరా పై సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ఆన్, ఆఫ్ విధానంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం సాగు నీరు రైతులకు అందాలని, ప్రతి నీటి చుక్కను వినియోగించుకోవాలని అన్నారు. ఎస్సారెస్పీ సాగు నీరు అందే కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ సూర్యాపేట, మహబూబాద్ జిల్లాలలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి రాబోయే మూడు వారాలపాటు అప్రమత్తంగా ఉంటూ పంటలు కాపాడేందుకు కృషి చేయాలని అన్నారు.‌ వేసవి కాలంలో త్రాగునీటి సరఫరా పై సిఎస్ శాంతి కుమారి సమీక్షిస్తూ, మిషన్ భగీరథ ద్వారా 25 వేల హాబిటేషన్స్ కు త్రాగు నీటి సరఫరా చేస్తున్నామని అన్నారు. రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు ఎట్టి పరిస్థితుల్లో రావద్దని అన్నారు. మిషన్ భగీరథ గ్రిడ్ నీటి సరఫరా కోసం సోర్స్ వద్ద అవసరమైన నీటి నిల్వలు ఉండేలా నీటిపారుదల శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ చర్యలు తీసుకోవాలని అన్నారు. మిషన్ భగీరథ ఇబ్బందులు ఉన్న గ్రామాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అన్నారు. గతంలో ఉన్న నీటి సరఫరా స్కీములు, పంప్ సెట్ ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు చేపట్టాలని, అవసరమైతే ప్రైవేట్ బోర్లను అద్దెకు తీసుకొవాలని అన్నారు. జిల్లాలో నీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని అన్నారు. రేషన్ కార్డు వెరిఫికేషన్ పై సీఎస్ శాంతి కుమారి సమీక్షిస్తూ, ప్రజా పాలన అర్జీలు, గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులు, మీసేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులు అన్నింటిని పరిశీలించి రేషన్ కార్డులు జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రజలు మరొకసారి మీసేవ కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, ఆ దిశగా ప్రజలకు అవగాహన కల్పించాలని సిఎస్ తెలిపారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ లేని ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ , మహబూబ్ నగర్ జిల్లాలలో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన జిల్లాలో కొత్త కార్డుల జారీ చేయాలని అన్నారు. రేషన్ కార్డులో స్క్రూట్ ని ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకారం అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలని సిఎస్ తెలిపారు. జిల్లాలలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలో సంక్షేమ హాస్టల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాలను నిరంతరం తనిఖీ చేస్తూ అక్కడ విద్యార్థులకు అవసరమైన వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలో తనిఖీలలో ఎదురయ్యే అనుభవాల పై నివేదిక అందించాలని సి ఎస్ తెలిపారు.  వీడియో కాన్ఫరెన్స్ లో హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్య లేదని, సమ్మర్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా చేతిపంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని డివిజన్లకు ధర్మసాగర్ నుండి నీటి సరఫరాను చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 24 నీటి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. డివిజన్లలో అదనంగా 21 నీటి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: