జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ వద్ద ఉన్న కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కొంపెల్లి గ్రామానికి చెందిన తూన్ల సురేష్ అనే ఆర్టిజన్ కార్మికుడు ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం ప్రకారం, సురేష్ మంగళవారం విధులకు హాజరైన అనంతరం కనిపించకుండా పోయాడు. బంధువులు, సహచరులు వెతికినా ఆచూకీ తెలియలేదు. బుధవారం ఉదయం సంపులో మృతదేహం లభ్యమవ్వడంతో హడావుడి నెలకొంది. సహోద్యోగులు, కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. వార్త తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. అకస్మాత్తుగా సహచరుడు ప్రాణాలు కోల్పోవడంతో ప్రాజెక్టు ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Post A Comment: