ఉమ్మడి వరంగల్: మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లా హసన్ పర్తి లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులను ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ సహకారంతో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం ఆనందంగా ఉందని, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు.
శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠశాల పూర్వ విద్యార్థి, ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ సహకారంతో మహర్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా వివిధ సంస్థల భాగస్వామ్యంతో రూ. 42 లక్షల వ్యయంతో గ్రంథాలయం, కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం ఏర్పాటు చేయగా వీటిని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, పాఠశాల పూర్వ విద్యార్థి, ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్, దాతలు హాజరై ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు మాట్లాడుతూ ఇదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఐపీఎస్ సాధించి, తాను చదువుకున్న పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వసతుల కల్పనకు, అభివృద్ధికి కృషి చేస్తున్న చెన్నూరి రూపేష్ కు అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాల తో పాటు జూనియర్ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, రీడింగ్ రూమ్, కిచెన్, ఆడిటోరియంను దాతల
సహకారంతో విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. కళాశాలలో నిర్మించిన ఆడిటోరియంలో ఫర్నిచర్ ను సొంత నిధులతో ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల, కళాశాలలకు ఉపయోగపడే విధంగా క్రీడా మైదానం అభివృద్ధికి నిధులను కేటాయిస్తానని పేర్కొన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ చదువుకుంటేనే జీవితాలు మెరుగుపడతాయని ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివిన వారేనని పేర్కొన్నారు. విద్యార్థి దశలో ఇంటర్మీడియట్ విద్య అనేది ఎంతో కీలకమని, క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. భావి జీవితానికి పునాది ఇంటర్మీడియట్ విద్య దోహదపడుతుందని పేర్కొన్నారు. తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్, మహర్షి ఫౌండేషన్ సత్యనారాయణ, అరుణ, ఉదయ్ ఎంతో కృషి చేశారని, వారి కృషి ప్రశంసనీయమని అన్నారు. తాము ఎదగడానికి ఉపయోగపడిన పాఠశాలకు, సమాజానికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. సమాజం మనకు ఎంతో ఇస్తుందని, మనం సమాజానికి తిరిగి సేవలను అందించాలన్నారు. విద్యార్థులు ప్రపంచంలో జరుగుతున్న వర్తమాన అంశాలను తెలుసుకోవాలని సూచించారు. సమాజానికి మనకు వీలైనంత సహాయాన్ని అందజేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థి పైన ఎంతో ఖర్చు చేస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యా సదుపాయాన్ని తప్పనిసరిగా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు , వైద్యులు, వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులు భావి జీవితంలో ఎదిగిన తర్వాత తిరిగి సమాజానికి తమ వంతుగా సేవలను అందించాలన్నారు. పాఠశాల, కళాశాలకు దాతలు అందించిన వనరులను చక్కగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థులకు ఐఐటి, నీట్, జేఈఈ మెయిన్స్, తదితర పోటీ పరీక్షలకు కోచింగ్ ఇప్పిస్తామన్నారు. మన జిల్లాలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఎన్ఐటి, కాకతీయ మెడికల్ కళాశాల ఉన్నాయని, ఆ విద్యాసంస్థల నుండి విద్యార్థులకు కోచింగ్ సహకారం అందించే విధంగా కృషి చేస్తామన్నారు. విద్యార్థులు ఉన్నత చదువుల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని ముందుకు రావాలన్నారు. జిల్లా అధికార యంత్రాంగం విద్యార్థులకు సహకార అందిస్తామని అన్నారు. పాఠశాల కళాశాలల అభివృద్ధికి తోడ్పాటునందిస్తామని పేర్కొన్నారు . మోడల్ క్యాంపస్ గా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామన్నారు.
పాఠశాల పూర్వ విద్యార్థి, ఐపీఎస్ అధికారి చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ చదువుతోనే తాను ఐపీఎస్ ని సాధించానని పేర్కొన్నారు. చదువుకు పేదరికం అడ్డు కాదని ప్రతి ఒక్కరూ సంకల్పంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించాలన్నారు. చదువుతోనే గొప్ప వ్యక్తులుగా సమాజంలో నిలబడతారని సూచించారు. తాను ఈ స్థాయిలో నిలబడడానికి తోడ్పాటు అందించిన పాఠశాలకు తనవంతు సహాయాన్ని అందించాలనే సంకల్పంతో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్, ఆడిటోరియం, లైబ్రరీ, ఇతర వసతుల కల్పనకు దాతల సహకారం మరువలేనిదని అన్నారు. పాఠశాలలు కళాశాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల, కళాశాలలో కల్పించిన సదుపాయాలను వినియోగించుకుని జీవితంలో ఎదగాలన్నారు. కల్పించిన సదుపాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల పైనే ఉందన్నారు.
ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన పలువురు విద్యార్థులకు రూ. 60వేల నగదు ప్రోత్సాహకాన్ని స్వాన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ సత్యనారాయణ, డైరెక్టర్ అరుణ అందజేశారు. పాఠశాలలు, కళాశాలలో వసతులు, అభివృద్ధికి సహకారం అందించిన దాతలు సత్యనారాయణ, అరుణ, బ్లోచీవ్ టెక్నాలజీ సీఈవో ఉదయ్, ఇతర దాతలను ఘనంగా శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను బహూకరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, డీఐఈవో గోపాల్, ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సుమాదేవి, విజయలక్ష్మి, మహర్షి ఫౌండేషన్ చైర్మన్ చెన్నూరు రవి, తిరుపతి, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొన్నారు.
Post A Comment: