జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామానికి చెందిన ముమ్మడి రాకేష్ అనే యువకుడు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి నిరసనకు దిగడంతో స్థానికులు, పోలీసులు కలకలమయ్యారు. రాకేష్ విశ్వకర్మ కులానికి చెందిన వాడిగా గోదావరి తీరంలో శ్రాద్ధకర్మ పూజలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా నిరంతరం పూజలు చేస్తూ వస్తున్న ఆయన, ఈరోజు కూడా గోదావరి వద్దకు వెళ్లాడు. అయితే అక్కడ బ్రాహ్మణ సంఘం సభ్యులు పూజలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ "ఇకపై గోదావరిలో ఈ కార్యక్రమాలు చేయకూడదు" అని ఆపివేయడంతో రాకేష్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. తనకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా వెంటనే కాళేశ్వరం గ్రామంలోని మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి, చేతిలో పెట్రోల్ సీసా పట్టుకుని ఆత్మహత్య యత్నం చేస్తానని హెచ్చరించాడు. దీంతో క్షణాల్లోనే పెద్ద ఎత్తున ప్రజలు గుమికూడారు. వార్త తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు ప్రజలు ఉద్రిక్తంగా ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరోవైపు పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. గ్రామస్థులు, బంధుమిత్రులు రాకేష్ పక్షాన నిలిచి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చివరికి గంటల పాటు సాగిన ఉద్రిక్తత అనంతరం పరిస్థితి క్రమంగా శాంతించింది. అయితే యువకుడి నిరసనతో కాళేశ్వరం ప్రాంతంలో ఆందోళన వాతావరణం నెలకొంది.
Post A Comment: