కాటారం మండల కేంద్రంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు విలేకరులతో మాట్లాడుతూ, మండల విద్యాధికారి శ్రీమతి ఐ. శ్రీదేవి నియంతృత్వ పద్ధతిలో వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాభివృద్ధి సమస్యలపై చర్చించేందుకు సమన్వయ సమావేశం కోరినా, రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు నిర్వహించలేదని తెలిపారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులపై దురుసుగా ప్రవర్తించడం, సెలవులు అడిగినా అవమానకరంగా మాట్లాడడం జరిగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది ఉపాధ్యాయులను జిపిఎస్ లొకేషన్, ఫోటోలు పంపాలని బెదిరించడం, డిప్యూటేషన్ విషయంలో ఎలాంటి గైడ్‌లైన్స్ పాటించకుండా తనకు అనుకూలంగా వారిని నియమించుకోవడం జరుగుతోందని ఆరోపించారు. ఒక ఉపాధ్యాయుడు అధికారికంగా సెలవు తీసుకున్నప్పటికీ షోకాజ్ నోటీసు ఇచ్చిన ఘటన, దానిపై వివరణ అడిగిన సంఘ నాయకుడిని అవమానకరంగా ఏకవచనంలో మాట్లాడిన తీరు అసహనాన్ని కలిగిస్తోందని తెలిపారు. పాఠశాలలో సమస్యలు వివరించడానికి వెళ్ళిన ఉపాధ్యాయుడికి “పాఠశాల మూసేసి ఇంట్లో పడుకో” అనే సమాధానం ఇచ్చిన విధానం తీవ్రంగా తప్పుబట్టారు. ఇకపై, జిల్లాలోని ఇతర మండలాల మాదిరిగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం పేరుతో వచ్చిన నిధులను వినియోగించకపోవడం, సంఘ నాయకులను సంప్రదించకపోవడం, “నా మాటే ఫైనల్, నన్ను ఎవరు ఆపలేరు” అనే ధోరణి ఉపాధ్యాయుల్లో అసహనాన్ని కలిగిస్తోందని తెలిపారు. “సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా చులకనగా చూస్తున్నారు. మండలంలో ఏ కార్యక్రమం అయినా నామమాత్రంగానే చేస్తున్నారు. తనిఖీల పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. ముఖ్యంగా మహిళా ఉపాధ్యాయులను అవమానించే రీతిలో మాట్లాడుతున్నారు” అని నాయకులు ఆరోపించారు. “ఇలాంటి విధానాలతో కొనసాగుతున్న మండల విద్యాధికారిని వెంటనే మార్చి, స్థానంలో వేరొకరిని నియమించాలి. అప్పుడే విద్యావ్యవస్థలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుంది” అని ఉపాధ్యాయ సంఘ నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో PRTU, STU, UTF, TTU, TPUS, TPTF, TRTF సంఘాల ప్రతినిధులు, అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
ముఖ్యంగా PRTU మండల అధ్యక్షుడు ఏ. రవీందర్, ప్రధాన కార్యదర్శి అనపర్తి తిరుపతి, వేణుగోపాల్, రాజు తదితరులు పాల్గొని ఆందోళన వ్యక్తం చేశారు.
Post A Comment: