ఉమ్మడి వరంగల్:మాడుగుల శ్రీనివాస శర్మ
ప్రతి విద్యార్థి తాము ఎంచుకున్న లక్ష్యం కోసం పట్టుదలతో చదివి సాధించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా పరకాల లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ లో తరగతి గదులు, కిచెన్, డార్మేట్రి, పరిసరాల ను పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. కలెక్టర్ విద్యార్థినులను పాఠ్యాంశాలకు సంబంధించి తరగతి గదిలోని బోర్డు పై రాయించారు. విద్యార్థినులకు వండిన భోజన పదార్థాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తరగతి గదులను సందర్శించి విద్యార్థినులచేత పాఠ్యాంశాలను చదివించారు.
ఆయా తరగతుల విద్యార్థినులతో మీ జీవిత లక్ష్యం ఏంటి, ఏం సాధించాలనుకుంటున్నారని అడగగా డాక్టర్, ఇంజినీర్స్ అవుతామని సమాధానమిచ్చా రు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఎంచుకున్న లక్ష్య సాధనకు మరింత కష్టపడాలని కలెక్టర్ సూచించారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను అందజేస్తామన్నారు. విద్యార్థినుల అభ్యసన, పఠన సామర్థ్యం తక్కువగా ఉందని, అభ్యసన సామర్థ్యం పెంపొందించే విధంగా ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అదేవిధంగా పరకాలలో ఉన్న గిరిజన సంక్షేమ వసతి గృహాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న వసతులు, విద్యార్థుల సంఖ్య ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ, తహసీల్దార్ విజయలక్ష్మి, ఎంపీడీవో ఆంజనేయులు, ప్రిన్సిపల్, ఉపాధ్యాయినులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: