ఉమ్మడి వరంగల్:
హనుమకొండ జిల్లాలో ఆసక్తి కలిగిన విద్యార్థులు సాహస కార్యకలాపాల ( అడ్వెంచర్ ఆక్టివిటీస్ )లో పాల్గొనాలని జిల్లా సంక్షేమ అధికారి జె. జయంతి అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లాలోని తొమ్మిది కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలకు చెందిన దాదాపు 400 మంది విద్యార్థినులకు ఈనెల 18 నుండి 21వ తేదీ వరకు ఫోర్టు వరంగల్ లోని ఏకశిలా పార్కులో సాహస కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి జయంతి మాట్లాడుతూ అడ్వెంచర్ యాక్టివిటీస్ కింద ఐదు(కయాకింగ్, వర్టికల్ ల్యాడర్ క్లయిమ్బింగ్, సింపుల్ సౌల్యూషన్ టూ కాంప్లెక్స్ ప్రాబ్లెమ్స్, రాప్లింగ్) సాహస కార్యక్రమాలకు సంబంధించి శిక్షణనిస్తున్నట్లు తెలిపారు.
కేజీబీవీల్లోని 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులను ఎంపిక చేసి సాహస కార్యకలాపాలలో శిక్షణను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. సాహస కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా విద్యార్థినులలో మనోధైర్యం పెంపొందుతుందని అన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను స్వయంగా పరిష్కరించుకునేందుకు ఇలాంటివి దోహదపడతాయని అన్నారు. తొలి రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో కేజీబీవీ ధర్మసాగర్, వేలేరు, ఐనవోలు కు చెందిన 79 మంది విద్యార్థినులు పాల్గొన్నారు. అడ్వెంచర్ యాక్టివిటీస్ ట్రైనర్ అన్విత సాహస కృత్యాలను విద్యార్ధినులకు శిక్షణనిచ్చారు. ఈ సాహస కార్యకలాపాలలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జీసీడీవో సునీత, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Post A Comment: