హనుమకొండ: భద్రకాళి చెరువు పూడికతీత పనులను వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశించారు. మంగళవారం భద్రకాళి చెరువు పూడికతీత పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులు, మట్టి తరలింపు, తదితర విషయాలను అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ చెరువు పూడికతీత పనులలో భాగంగా తీసిన మట్టిని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా తరలింపు జరగాలన్నారు. మట్టి తరలింపునకు వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతర్గత రోడ్డు( అప్రోచ్ రోడ్డు)ను నిర్మించాలని సూచించారు. మట్టి తరలింపు సమయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. పనులు జరుగుతున్న చోట్ల రాత్రి వేళలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు. మట్టి తరలించే వాహనాల నమోదు కోసం జంక్షన్, చెక్ పోస్ట్ ను ఏర్పాటుచేసి రెవెన్యూ, పోలీస్, సాగునీటి పారుదల, మున్సిపల్ శాఖల సిబ్బందితో 24 గంటల పాటు పర్యవేక్షణ, తనిఖీ ఉండేటట్టు చూసుకోవాలన్నారు. పూడికతీత మట్టి కావాలనుకునేవారు క్యూబిక్ మీటర్ కు రూ. 72 చెల్లించి తీసుకోవచ్చునని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, మున్సిపల్, కుడా, సాగునీటిపారుదల శాఖల అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: