హనుమకొండ:
ఎలాంటి చెడు అలవాట్లకు లోను కాకుండా విద్యార్థులు సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని సమ్మిళిత విద్య సమన్వయకర్త సుదర్శన్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఆదేశాల మేరకు డీఈవో వాసంతి సూచనతో జిల్లా పాఠశాల విద్యా శాఖ ఆధ్వర్యంలో హనుమకొండ లోని ఏకశిలా కాన్సెప్ట్ హైస్కూల్ లో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి పాఠశాల విద్యార్థులతో కూడిన ప్రహరి క్లబ్ ను ఏర్పాటు చేశారు. ప్రహరీ క్లబ్ లో పాఠశాలకు చెందిన 6 నుండి పదో తరగతి వరకు విద్యార్థులతో కూడిన విద్యార్థుల బృందంతో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఎవరూ కూడా మత్తు పదార్థాలతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని అన్నారు. మత్తు పదార్థాలతో అనేక దుష్ఫలితాలు కలుగుతాయని విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలల పరిసర ప్రాంతాల్లో మత్తు పదార్థాలు విక్రయించిన, సేవించినా ఆ సమాచారాన్ని ప్రహరీ క్లబ్ విద్యార్థులకు, సంబంధిత ఉపాధ్యాయులకు సమాచారం అందించినట్లయితే సంబంధిత గ్రామ పోలీస్ అధికారికి తెలియజేస్తారన్నారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. శారీరక మానసిక వికాసానికి దోహదపడే క్రీడలను బాల్య దశ నుంచే అలవర్చుకుంటే జీవితం ఆనందమయంగా ఉంటుందన్నారు.ఈ సందర్భంగా విద్యార్థుల చేత డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య రవికుమార్ విద్యార్థులలో ప్రేరణ కల్పించే విధంగా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Post A Comment: