ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాస శర్మ
ఉమ్మడి వరంగల్;
హనుమకొండ లో క్షయ (టీబీ) వ్యాధి నిర్మూలనకు పకడ్బందీ ప్రణాళికతో కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.
సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ లో హనుమకొండ, వరంగల్ జిల్లాలలో టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా టిబి నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల తీరుతెన్నులపై రెండు జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో గవర్నర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ టీబీ వ్యాధి నిర్మూలనకు ఇరు జిల్లాల కలెక్టర్లు, రెడ్ క్రాస్ సొసైటీ సమన్వయంతో పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. దేశంలో టీబీ వ్యాధి నిర్మూలననే లక్ష్యంగా ప్రధాని టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం తీసుకువచ్చారని అన్నారు. టీబీ వ్యాధి నిర్మూలనకు స్క్రీనింగ్ క్యాంపులను విస్తృతంగా నిర్వహించి టీబీ కేసులను గుర్తించాలన్నారు. ప్రజల్లో టీబీ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్నారు. టీబీ నిర్మూలనకు చేపడుతున్న కార్యక్రమాలు నిరంతరం కొనసాగించాలన్నారు. టీబీ నిర్మూలన కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ సొసైటీ భాగస్వామ్యం కావాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన పేషెంట్లకు దాతల ద్వారా పోషక ఆహార కిట్లను దాతల ద్వారా అందించాలన్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ హనుమకొండ జిల్లాలో దాదాపుగా 9లక్షల జనాభా ఉన్నారని తెలిపారు. ఇందులో 1.98 లక్షల మంది హై రిస్క్ గ్రూపులో ఉన్నారని, వీరందరిని స్క్రీనింగ్, ఎక్స్ రే చేసి లక్షణాలు ఉన్నవారికి తెమడ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 6923మంది కి స్క్రీనింగ్ పరీక్షలు చేయగా, ఇందులో 1389 మందికి ఎక్స్ రే పరీక్షలను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎక్స్ రే పరీక్షలలో ప్రభుత్వ వైద్యశాలలతో పాటు ప్రైవేటు ఆసుపత్రులనూ భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి తో పాటు పీఎంఎస్ఎస్వై , పరకాలలో ఏరియా ఆసుపత్రి, హనుమకొండలో టీబీ ఆసుపత్రి ఉన్నాయన్నారు. హనుమకొండలోని టీబీ ఆసుపత్రి, పరకాలలోని ఏరియా ఆసుపత్రిలో టీబీ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో 720మంది క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమాలలో భాగంగా జిల్లాలో జూన్ 2వ తేదీ నుండి టీబీ స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో 204979 మంది హై రిస్క్ గ్రూపులో ఉన్నారని, అందులో 5389మందిని ఇప్పటివరకు పరీక్షలను నిర్వహించడం జరిగిందని, ఇందులో 176 మందికి ఎక్స్ రే పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో 594మంది క్షయ వ్యాధిగ్రస్థులను గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లాకు రూ. 60వేలు, వరంగల్ జిల్లాకు రూ. 40వేలను టీబీ పేషెంట్లకు పోషకాహార కిట్లను అందించేందుకు ఇనగాల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కుడా ఛైర్మెన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, అదేవిధంగా డాక్టర్ వాసవి రాకేష్ రెడ్డి దంపతులు హనుమకొండ జిల్లాకు రూ. 50 వేలను, డాక్టర్ వంగ హేమంత్ రెడ్డి రూ.20వేలను రాష్ట్ర గవర్నర్ సమక్షంలో కలెక్టర్లకు అందజేశారు.
ముందుగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ విచ్చేయగా హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అడిషనల్ కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, హనుమకొండ వరంగల్ ఆర్డీవోలు రాథోడ్ రమేష్, సత్యపాల్ రెడ్డి, డిఎంహెచ్వోలు డాక్టర్ అప్పయ్య, డాక్టర్ సాంబశివరావు, రెడ్ క్రాస్ సొసైటీ నుండి డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి, రాష్ట్ర ఈసీ మెంబర్ ఇ.వి. శ్రీనివాస్ రావు, బిల్లా రమణారెడ్డి, ప్రభుత్వ వైద్య అధికారులు డాక్టర్ మోహన్ దాస్, డాక్టర్ హిమబిందు, డాక్టర్ సునీత, డాక్టర్ ఆచార్య, ఇతర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పాల్గొన్నారు.


Post A Comment: