హన్మకొండ ;
జిల్లాలో ఓటర్ జాబితా సవరణ 2024-25 సంబంధించి ప్రణాళికాబద్ధంగా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్ , టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఓటరు రూపకల్పన పై జిల్లాల కలెక్టర్ లకు వీడియో సమావేశం ద్వారా శిక్షణ అందించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు వస్తున్న దరఖాస్తుల విచారణ మిషన్ మోడ్ లో పూర్తి చేయాలని అన్నారు. ఉమ్మడి మెదక్- నిజామాబాద్- అదిలాబాద్- కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల స్థానానికి లక్ష దరఖాస్తులు, టీచర్ల స్థానానికి 2046 దరఖాస్తులు రాగా పట్టభద్రుల 7 వేల దరఖాస్తులు మాత్రమే విచారణ పూర్తి అయ్యాయని ,వరంగల్- ఖమ్మం -నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయుల స్థానానికి 2730 దరఖాస్తులు వస్తే అన్ని పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. పెండింగ్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదు దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ లకు ఆదేశించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలలో పాల్గొనేందుకు అర్హులైన ఓటర్లు తమ పేర్లను ఓటరు జాబితాలో నవంబర్ 6 లోపు నమోదు చేయాలని అన్నారు.ఓటర్ జాబితా సవరణ 2024-25 కోసం స్వీప్ కార్యక్రమాలు పక్కాగా చేపట్టాలని, దీని కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులు నియమించాలని అన్నారు. జనవరి 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని అన్నారు. యువ ఓటర్ల నమోదు తో పాటు దివ్యాంగులు, థర్డ్ జెండర్, సెక్స్ వర్కర్ మొదలగు వర్గాలు, ఆదివాసీ, గిరిజనుల ఓటర్ల నమోదు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.
ఓటర్ జాబితా రూపకల్పన పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలని, ఏ ఒక్కరిని వదల కుండా ఓటు హక్కు కల్పించాలని అన్నారు. అక్టోబర్ 29న డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల చేయడం జరుగుతుందని, దీనిపై అభ్యంతరాలను, నూతన ఓటర్ నమోదు దరఖాస్తులను నవంబర్ 29 వరకు స్వీకరిస్తామని, డిసెంబర్ 26 వరకు అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 6న తుది ఓటర్ జాబితా ప్రచురించాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట రెడ్డి, రెవెన్యూ డివిజన్ అధికారి వెంకటేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: