రక్తదాతలు ప్రాణదాతలతో సమానమని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరే అన్నారు. సోమవారం జిల్లా ఆర్మూడ్ రిజర్వ్ ప్రధాన కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం (పోలీసు ఫ్ల్లాగ్ డే) పురస్కరించుకొని ఇండియన్ రెడ్ క్రాస్ సహాకారంతో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా కలెక్టర్, ఎస్పి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పి కిరణ్ ఖరే రక్తదానం చేశారు.
అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలన్నారు. అలాగే ప్రజలకు అన్ని వేళలా తోడుగా ఉంటూ పోలీసులు తమ ఉద్యోగాలు చేస్తున్నారని, పోలీసు వృత్తి అనేక వత్తిళ్లతో కూడుకున్నదని, పోలీసులు తమ వృత్తి ధర్మం కోసం తమ కుటుంబాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. కొందరు పోలీసులు తమ కర్తవ్య నిర్వహణలో తమ ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్పి కిరణ్ ఖరే మాట్లాడుతూ
అమరవీరుల త్యాగానికి గుర్తుగా రక్తదాన శిబిర కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. రక్తదానం చేస్తే ఆపదలో ఉన్న ఓ ప్రాణాన్ని కాపాడవచ్చునని తెలియజేశారు. ప్రతి వ్యక్తి రక్తదానం చేసే గుణాన్ని ఏర్పరచుకోవాలన్నారు. అనం తరం రక్తదానం చేసిన వారికి ఎస్పి కిరణ్ ఖరే సర్టిఫికెట్లను అందజే శారు. ఈ రక్తదాన శిబిరంలో 150 యువత, పోలీసులు, వివిధ వర్గాల ప్రజలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ బోనాల కిషన్, కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, డిఎస్పీలు సంపత్ రావు, రామ్మోహన్ రెడ్డి, నారాయణ నాయక్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్, జిల్లా పరిధిలోని సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ఎస్సైలు, ప్రజలు, యువత పాల్గొన్నారు.
Post A Comment: