పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాలను ఈ నెల 21వ తేదీ నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే శనివారం తెలిపారు. విధినిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసులను స్మరించుకునేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా పోలీసుల విధులు, టెక్నాలజీ వినియోగం, రక్తదాన శిబిరాలు, ఓపెన హౌస్, అమరవీరుల కుటుంబాల సందర్శన, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, కొవ్వొత్తుల ర్యాలీ, సైకిల్ ర్యాలీ, మరికొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు .తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ఇంటర్ విద్యార్థుల వరకు 'విచక్షణతో కూడిన మొబైల్ ఫోన వాడకం' అంశంపై, డిగ్రీ ఆపై విద్యార్థులకు 'తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడంతో నా పాత్ర' అనే అంశాలపై, అలాగే పోలీసు అధికారులు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాస రచన పోటీల్లో ఉత్తమ ప్రతిభ చూపిన ముగ్గురికి బహుమతులు అందజేస్తామన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో వివిధ కేటగిరిలో మూడు ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. అలాగే పబ్లిక్ స్థలాల్లో, పోలీసు అమరవీరుల గురించి తెలుపుతూ వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధి లోని ప్రధాన కూడళ్ళ వద్ద పోలీస్ అమరవీరుల బ్యానర్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు.
Post A Comment: