ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
విద్యార్థినులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు.
సోమవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఆరోగ్య కార్డుల పంపిణీ, ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థినులను ఉద్దేశించి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థినికి చదువుతోపాటు ఆరోగ్యం, వ్యక్తిగత శ్రద్ధ ఎంతో అవసరమని అన్నారు. ప్రతి విద్యార్థిని ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పౌష్టిక ఆహారాన్ని భోజనంలో ఉండే విధంగా విద్యార్థినులు చూసుకోవాలన్నారు. జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని , సహజ సిద్ధమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలన్నారు. రక్తహీనత, థైరాయిడ్, తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. విద్యార్థినులకు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. కరోనా అనంతర పరిస్థితులలో శారీరక, మానసిక పరిస్థితులలో మార్పులు వస్తున్నాయని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు విద్యార్థుల ప్రవర్తన మార్పులను గమనించి తదననుగుణంగా వైద్య సహాయాన్ని అందించాలన్నారు. సమాజంలో సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైందని, విద్యార్థులు సోషల్ మీడియాకు ఆకర్షితులు కావద్దన్నారు. సోషల్ మీడియాకు ఆకర్షితులై వ్యక్తిగత విషయాలను బహిరంగపరచకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రభుత్వం ద్వారా మనం చదువుతున్నామంటే సమాజం చదివిస్తుందని అర్థం అని, అదే సమాజానికి విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకొని తమ వంతు బాధ్యతగా సేవ చేయాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి సమాజాభివృద్ధికి తోడ్పడాలన్నారు. మనల్ని సహాయం కోరి వచ్చే వారికి తప్పకుండా సాయం అందించాలన్నారు. విద్యార్థినులు బాగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలబడాలన్నారు. విద్యార్థిను లకు చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు మానసిక వికాసాన్ని పెంపొందించడానికి దోహదపడతాయని అన్నారు. డిగ్రీ కళాశాలను తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్. నాగరాజు మాట్లాడుతూ పాఠశాలలో చదువుకున్న రోజులు మధురస్మృతులుగా నిలిచిపోతాయని అన్నారు. హాస్టల్లో చదువుకుంటున్న విద్యార్థినులు స్నేహభావంతో కలిసిమెలిసి ఉండాలని ఉండాలన్నారు. విద్యార్థులు చదువుకు ప్రాధాన్యత నివ్వాలని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. పాఠశాల విద్యార్థులు క్రికెట్, వాలీబాల్, టెన్నికాయిట్, స్కిప్పింగ్, తదితర క్రీడా సామగ్రిని అడిగారని, రూ. 40 వేల విలువైన క్రీడా వస్తువులను ఈ సందర్భంగా అందజేస్తున్నట్లు తెలిపారు. క్రీడా సౌకర్యాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థినులు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కాపాడుకోవాలన్నారు. ఉదయకాలం సూర్యరశ్మిలో ఒక గంట పాటు ఆటల పోటీలలో పాల్గొనాలని సూచించారు. విద్యార్థినులు ఒక ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగి విజయం సాధించాలన్నారు. ప్రతి హాస్టల్లో ఒక ఫిర్యాదుల బాక్స్ ను ఏర్పాటు చేస్తే సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ కస్తూరిబా పాఠశాల ఇంటర్మీడియట్ వరకు ఉందని, ఈ పాఠశాలను డిగ్రీ కళాశాల స్థాయి వరకు ఎంపీ, ఎమ్మెల్యేలు తీసుకెళ్లాలని కోరారు. విద్యార్థినిలకు హెల్త్ కార్డులను పంపిణీ చేయడం మంచి ఆలోచన అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ విద్యార్థినులు ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే వైద్య సహాయం తీసుకోవాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన హెల్త్ కార్డులను రూపొందించినట్లు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఈ పాఠశాలలో
ప్రతి నెల 15 నుంచి 20వ తేదీ వరకు విద్యార్థినిల కోసం ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తల్లిదండ్రులకు కూడా తెలిసే విధంగా హెల్త్ కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినిలు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని సూచించారు. 9 కేజీబీవీలు, మూడు మోడల్ స్కూల్స్, ఒక అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు 4000 హెల్త్ కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు .
హెల్త్ కార్డులను ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కలెక్టర్ ప్రావీణ్య, చేతుల మీదుగా విద్యార్థినులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డీఈఓ వాసంతి, డిఎంహెచ్వో డాక్టర్ లలితా దేవి, తహసిల్దార్ విక్రమ్, ఇతర అధికారులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Post A Comment: