ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా స్వీప్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలను చేపట్టినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
గురువారం సాయంత్రం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లోని డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో స్వీప్ ఆధ్వర్యంలో ఓటరు చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ వివిధ శాఖల సమన్వయంతో స్వీప్ ఆధ్వర్యంలో విభిన్న కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా మెప్మా, డిఆర్డిఏ, పరిశ్రమల శాఖల సహకారంతో గత నెల రోజులకు పైగా స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 13న తెలంగాణలో జరగనున్న నాలుగో దశ పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, షేడ్ నెట్లను , ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఇతర ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్లకు వసతులను కల్పిస్తున్నామని, ఓటు కలిగిన ప్రతి ఒక్కరు ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రాధిక గుప్తా మాట్లాడుతూ ఈ సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరూ తమ చుట్టుపక్కల ఉండే ఓటర్లకు ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రాలకు తీసుకురావాలని పేర్కొన్నారు.
సాంస్కృతిక కళాకారులు, మహిళా సంఘాల ప్రతినిధులు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ చుట్టూ ర్యాలీని నిర్వహించారు. సమావేశం అనంతరం ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేస్తామని, తమ చుట్టుపక్కల ఉన్న ఓటర్లను ఓటు వేసే విధంగా చైతన్యవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి, డిఆర్డిఓ నాగ పద్మజ, అదనపు నోడల్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఎం.హరిప్రసాద్, జిల్లా సంక్షేమ అధికారి మధురిమ, ఇతర అధికారులు, వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, సీనియర్ సిటిజన్లు పాల్గొన్నారు.
Post A Comment: