ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వేసవి కాలం దృష్ట్యా తాగునీటి సరఫరా లో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ. శాంతి కుమారి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో తాగునీరు, ధాన్యం కొనుగోళ్లు, పాఠశాలల్లో మరమ్మతులు, వేసవి కాలం దృష్ట్యా వడగాలుల నుండి రక్షణ చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్లు రాధిక గుప్తా, వెంకట్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ప్రతి ఇంటికి తాగునీరు అందేవిధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. తాగునీటి సరఫరాలో ఏ సమస్య తలెత్తినా వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి పైపులైన్లు లీకేజీలు ఉన్నట్లయితే మరమ్మతులు చేపట్టాలన్నారు. వేసవి ముగిసే నాటికి కూడా ఎక్కడ కూడ తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు.
అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని సిఎస్ శాంతి కుమారి అన్నారు. ధాన్యం కొనుగోలులో ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. గన్నీ సంచులను ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా సిఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేసేవిధంగా కృషి చేయాలన్నారు.
అమ్మ ఆదర్శ పాఠశాలల ఆధ్వర్యంలో పాఠశాలల్లో వెంటనే చేపట్టే మరమ్మతు పనులను గుర్తించి పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. పాఠశాలల్లో చేపట్టే పనులు నాణ్యంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
వేసవి దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్ల ను అందుబాటులో ఉంచాలని అన్నారు. వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు పాఠశాలల్లో చేపట్టిన పనులు ఏ ఏ దశలకు చేరుకున్నాయి, వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపు, ఇంకా చేపట్టాల్సిన చర్యల గురించి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సిఎస్ దృష్టికి తీసుకెళ్లారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జీరో ఎన్రోల్మెంట్ పాఠశాలల వివరాలను తీసుకోవాలని, మన ఊరు మనబడి కార్యక్రమంలో ఏవైనా అసంపూర్తి పనులు మిగిలి ఉంటే పూర్తి చేయాలని పేర్కొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్డిఓ నాగ పద్మజ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి, జిల్లా మేనేజర్ మహేందర్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, సిపిఓ సత్యనారాయణరెడ్డి, మిషన్ భగీరథ ఈఈ రామాంజనేయులు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్ హై, డిసివో నాగేశ్వర్ రావు, మెప్మా పీడీ భద్రు నాయక్, జీడబ్ల్యూఎంసి ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈ రాజయ్య, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, ఆర్ అండ్ బి డీఈ గౌస్ , కుడా, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: