ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హనుమకొండ నయీమ్ నగర్ లోని చైతన్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఓటింగ్ సరళిని గురించి సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి రెండు ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేయగా పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కునువినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా సాగే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను కలెక్టర్ పలకరించారు. వారితో మాట్లాడి ఏవైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఉన్న ఏర్పాట్లను గురించి జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్ హై, నోడల్ అధికారి సురేష్ , తహశీల్దార్ బావు సింగ్ లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సి డి సి లోని రెండు ఫెసిలిటేషన్ సెంటర్లలో మూడు రోజులపాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం నుండి 28వ తేదీ వరకూ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేయవచ్చునని అధికారులు తెలిపారు.
పోలింగ్ రోజున ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
హనుమకొండ : ఈ నెల 30వ తేదీన జరగనున్న ఎన్నికల లో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. హనుమకొండలోని నయీమ్ నగర్ లో ఉన్న చైతన్య డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఎన్నికల విధులలో పాల్గొననున్న O. P.O లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో పాల్గొననున్న ఓపిఓలు భారత ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని పేర్కొన్నారు. ఎన్నికల రోజున మార్క్ పోలింగ్ మొదలుకొని ఓటింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల రోజున ప్రతి పోలింగ్ కేంద్రంలో పనిచేసే ఎన్నికల అధికారులు సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ కి చివరి రోజు కావడంతో ఎంతమంది పోస్టల్ బ్యాలెట్ ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ వారిని అడిగి తెలుసుకున్నారు. అందులో కొంతమంది దరఖాస్తు చేసుకోలేదని తెలియజేయడంతో తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా డీఈవో డాక్టర్ అబ్దుల్ హై, నోడల్ అధికారి సురేష్ , తహశీల్డర్ బావుసింగ్, అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: